కట్టప్ప.. గొప్ప మెలికే వేశాడు. కన్నడీగులకు సారీచెప్పినట్టే చెప్పి… బోల్డన్ని షరతుల్ని లింకెట్టాడు. కావేరీజాలాల విషయంలో కట్టప్ప సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. సత్యరాజ్ కామెంట్ల వల్ల బాహుబలి 2 పై దెబ్బపటేట్టు కనిపించింది. ఈ సినిమాని ఆపేస్తాం అంటూ కన్నడీగులు ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో సత్యరాజ్ దిగి వచ్చి సారీ చెప్పక తప్పలేదు.
కానీ ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. తాను పడినా పైచేయి తనదే ఉంటేట్టు చూసుకోగలిగాడు సత్యరాజ్. ఆ సారీ వెనుక.. కొన్ని షరతులు కనిపించాయి. తన వల్ల ఓ సినిమాకి నష్టం రావడం ఇష్టం లేక సారీ చెప్పానన్న సత్యరాజ్ అక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. బాహుబలి కోసం సారీ చెబుతున్నా అన్నట్టున్నాయి సత్యరాజ్ వ్యాఖ్యానాలు. అంతే తప్ప… మనస్ఫూర్తిగా క్షమాపణలు అడిగినట్టు కనిపించలేదు. అంతేకాదు.. ఇకముందు కూడా కావేరీ జలాల విషయంలో తాను తన గళం వినిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. తనకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని హితవు పలికాడు. పదే పదే తనతో క్షమాపణలు చెప్పించాలని చూడొద్దని హెచ్చరికలాంటిది జారీ చేశాడు. సత్యరాజ్ క్షమాపణ కేవలం బాహుబలి 2ని దాటించేయడానికికే అన్నది సుస్పష్టం. ఈ సినిమా విడుదలై, తన పని తాను చూసుకొని వెళ్లిపోయాక… మళ్లీ ఇదే విషయంపై సత్యరాజ్ గొంతు విప్పే అవకాశం ఉంది. అందుకే.. `ఇకపై క్షమాపణలు చెప్పే ప్రస్తకి లేదు` అన్నట్టు మాట్లాడగలుగుతున్నాడు. సత్యరాజ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం కన్నడీగులకు కూడా అర్థమైంది. సత్యరాజ్ ఇలా మాట్లాడడం, క్షమాపణలు చెప్పినా హెచ్చరికలా ఉండడం… బాహుబలి చిత్రబృందానికి మింగుడు పడని వ్యవహారమే. బాహుబలి 2కి గండం ఇంకా గట్టెక్కలేదనే అనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.