ఇటీవల ఓ తమిళ సినిమా ఫంక్షన్లో తెలుగు చిత్రసీమపై వ్యంగ్య బాణాలు విసిరాడు అజయ్ ఘోష్. ప్రతిభా వంతుల్ని గుర్తించడం తెలుగువాళ్లకు చేతకాదంటూ చురకలు అంటించాడు. అజయ్ ఘోష్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఇలా మాట్లాడుతున్నాడేంటి?? అని అంతా ముక్కున వేలేసుకొన్నారు. జరిగిన తప్పుని గుర్తించిన ఈ నటుడు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నాడు. ‘తప్పు తండా’ ఆడియో ఫంక్షన్ లో తాను మాట్లాడిన కొన్ని మాటలు కొంత మందిని ఇబ్బంది పెట్టాయని తెలిసినది.. వాళ్లందరికీ నా క్షమాపణలు అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు అజయ్.
”ఇటీవల జరిగిన ‘తప్పు తండా’ ఆడియో ఫంక్షన్ లో సరదాగా మాట్లాడాను తప్ప … ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. మహా నటులు ఎన్టీఆర్ గారు, నాగేశ్వర రావు గార్ల తో పాటు ఇంకా ఎంతో మంది మహా నటులకు వేదిక గా నిలిచింది చెన్నై నగరం. అలాంటి మహా నగరాన్ని సరదాగా పొగిడాను తప్ప .. ఏ దర్శకుణ్ణి కించపరచడానికి కాదనీ సవినయంగా మనవి చేసుకుంటూ.. ఒకవేళ నేను ఏమైనా తప్పుగా మాట్లాడివుంటే .. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటె .. పెద్ద మనసుతో క్షమించమని ప్రార్థిస్తున్నా” అంటూ వేడుకున్నాడు అజయ్ ఘోష్.