ఉన్నట్టుండి.. పాకిస్తాన్‌తో కయ్యం…చైనాతోనూ మాటల యుద్ధం… ఇటు దేశంలో నారద స్టింగ్ ఆపరేషన్ పేరుతో పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేసు..ఢిల్లీలో గవర్నర్ తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో వివాదం…మహాఘటబంధ్ ఏర్పాటుచేయాలని మమత పిలుపు…ఇటు ఆంధ్ర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోట ముందస్తు ఎన్నికల మాట. త్వరలోనే ఎన్నికలకు వెళ్ళాల్సి రావచ్చని పార్టీ నేతల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్య. వీటన్నింటికీ ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల అన్న దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించాలన్న సూచన..
ఇవన్నీ చూస్తుంటే దేశం మీద యుద్ధ మేఘాల మాదిరిగా ఎన్నికల పవనాలు ఆవరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకింత తొందర. కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఏర్పడి మూడేళ్ళు కూడా పూర్తికాలేదు. అప్పుడే ఎందుకు ఈ మాటలు..
భారత దేశంలో ఎన్నికలు రాబోతున్నాయన్న దానికి ఎప్పుడూ ఒక సూచిక కనిపిస్తుంది. అదే దాయాది దేశంతో యుద్ధం వచ్చేస్తోందన్నంత సీన్ క్రియేట్ చేస్తారు. లేదా.. చైనా అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించేస్తోందంటారు. ఈసారి అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు పేర్లు మార్చేసిందని చైనాతో పేచీ మొదలెట్టారు. అంతకు ముందు జాదవ్ అనే భారతీయుడి పాకిస్తాన్ ఉరి శిక్ష విధించినట్లు వచ్చిన వార్తలను పురస్కరించుకుని ఆ దేశంతో సంబంధాలను సాధ్యమైనంతగా వేడిగా ఉంచి, తద్వారా ప్రజలలో దేశ భక్తిని రగిల్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూక్తిని భారతీయ నతా పార్టీ ప్రభుత్వం చక్కగా ఆచరణలో పెడుతోంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లో ఊహాతీత విజయాన్ని సొంతం చేసుకున్న ఆ కాషాయ దళం తనకిక ఎదురు లేదనే అభిప్రాయానికి వచ్చినట్లే కనిపిస్తోంది. ఏడాది కంటే తక్కువ వ్యవధి ఉండగానే ఎన్నికలకు వెళ్ళాలనే నిర్ణయానికి మోడీ బృందం సిద్ధమవుతోందనడానికి ఇవన్నీ సూచనలు. రెండేళ్ళ తరవాత పరిస్థితులు ఎలా ఉంటాయో…వేడిగా ఉండగానే ఇనుమును సాగదీయాలనుకుంటున్నట్లు తోస్తోంది. నాలుగు దశాబ్దాల పైగా అనుభవమున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇలాంటివి అంచనా వేయడం వెన్నతో పెట్టిన విద్య. అందుకే.. శుక్రవారం నాటి సమావేశంలో తెలుగు దేశం పార్టీకి ఓటు బ్యాంకు ఎంత పెరిగిందీ..వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఎంత తగ్గిందీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ గణాంకాలు చెప్పిన అనంతరం, త్వరలోనే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవ్వాలంటూ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వైసీపీ నుంచి ఇంచుమించుగా సగం మంది ఎమ్మెల్యేలను ఆకర్షించి, బలాన్ని వాపుగా మార్చేసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆయా నియోజకవర్గాల్లో తనకు పట్టు ఉందని భావిస్తోంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, అసెంబ్లీ స్థానాలు 225కు చేరతాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 200 సీట్లను గెలుచుకుంటుందని మంత్రి నారా లోకేశ్ చెప్పిన విషయాన్ని పట్టుకుని కొంతమంది సోషల్‌మీడియాలో ఆయనకు లెక్కలు రావని గేలిచేశారు. అక్కడే వాళ్ళు తప్పులో కాలేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలకు వెళ్ళాలంటే సగం రాష్ట్రాల అనుమతి తప్పని సరి. ఇప్పటికే 16 రాష్ట్రాలలో నేరుగానో.. మిత్రపక్షాలతో కలిసో బీజేపీ అధికారంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజనకు అంగీకరిస్తే టీడీపీ కూడ తనకు ఒనగూరే లాభాలను బేరీజు వేసుకుని ఓకే చేసే అవకాశముంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నారా లోకేశ్ అలా అని ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సూచనలు చాలవా… దేశంలో ఒకేసారి ముందస్తు ఎన్నికల పవనాలు వీయడానికి రంగం సిద్ధమైపోతోందని చెప్పడానికి. ఎటొచ్చీ..2004లో మాదిరి ఫలితాలొస్తేనే అంచనాలు తారుమారవుతాయి.
Subrahmanyam Vs Kuchimanchi