అందరూ రైతులు గురించి మాట్లాడతారు. రైతేరాజు అయిపోతాడనీ, రాజ్యాన్ని శాసించే శక్తిగా ఎదుగుతాడనీ ఇలా చాలా చెబుతుంటారు. నిజానికి, ఇలాంటి వినీవినీ రైతులకే విసుగెత్తుతోంది. తెలంగాణ రాజకీయ పార్టీలకు రైతులపై మరింత ప్రేమ పెరిగిపోతోంది. అధికార పార్టీ తెరాసకు అయితే మరీనూ! ఈ మధ్యనే తొలి పంటకు ఉచిత ఎరువులు అంటూ కేసీఆర్ ఒక వరమిచ్చారు. దాని అమలుకు ఇంకా టైం ఉందనుకోండీ. ఇప్పుడు ప్లీనరీలో మరిన్ని వరాలూ ఆశలూ అరచేతిలో వైకుంఠం కూడా చూపించేశారు.
రైతులతే రాజ్యం అన్నారు. రాబోయే రోజుల్లో అత్యంత ధనవంతులైన రైతులున్న రాష్ట్రం ఏదీ.. అంటే, అందరూ తెలంగాణ వైపు చూస్తారని చెప్పారు. తొలి పంటకే కాదు.. ఇకపై రెండో పంటకి కూడా ఉచితంగానే ఎరువులు ఇస్తామని కేసీఆర్ వరమిచ్చారు. రెండు పంటలకూ పెట్టుబడి కూడా ఇస్తామన్నారు. ప్రతీయేటా మే నెలలో ఒకసారి, అక్టోబర్ లో మరోసారి రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తామనీ, ఈ పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ పథకాల అమలు కోసం రైతు సంఘాలు ఏర్పాటు చేస్తామనీ, అవి అత్యంత క్రియాశీలంగా పనిచేస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. వ్యవసాయం పనులు లేని రోజుల్లో ఉపాధి హామీ పనులు కల్పించి.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా కేసీఆర్ తన ప్రసంగంలో ఇలా రైతుల భవిష్యత్తు ఇలా ఉండబోతోందని వివరించారు.
భవిష్యత్తు గురించే మాట్లాడారు! సరే… కానీ, వర్తమానం సంగతేంటి.? ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారాలేవీ…? ఏదో ఎన్నికల మ్యానిఫెస్టో మాదిరిగా ముఖ్యమంత్రి ఇప్పుడు ఇలా మాట్లాడటమేంటీ..? గడచిన మూడేళ్లుగా వారే అధికారంలో ఉన్నారు కదా. రైతులకు ఏం చేశారో చెప్పాలిగానీ… భవిష్యత్తులో అది చేస్తాం, ఇది చేస్తాం అని చెబుతూ ఉండటం మరీ విడ్డూరం!
కాంగ్రెస్ పార్టీ కూడా ఇలానే తయారైంది..! తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయాల రుణమాఫీ చేస్తామంటూ ఓ వరాన్ని ప్రకటించింది. రైతుల మీద అనూహ్యంగా ఆ పార్టీకీ ప్రేమ పుట్టుకొచ్చేసింది. గడచిన మూడేళ్లలో రైతుల తరఫున కాంగ్రెస్ పోరాడి సాధించింది ఏదైనా ఉందా..? ఏతావాతా రైతులకు అర్థమౌతున్నది ఏంటంటే… పార్టీలకు ఓట్లు కావాలి. అందుకే, వరాలు అనేవి అర్థమౌతున్నాయి