తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సంస్థాగతంగా కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ప్లీనరీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై తెరాసలోని పార్టీ పదవులన్నీ నాలుగేళ్లపాటు ఉంటాయి. కింది స్థాయిలో మాత్రమే కాదు… పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచీ నియోజక వర్గాల కమిటీల స్థాయి వరకూ ఇదే నిర్ణయం వర్తిస్తుంది. గతంలో రెండేళ్ల ప్రాతిపదిక ఈ పదవుల కాలం ఉండేది. పార్టీ అధ్యక్షుడి నియామకం కూడా రెండేళ్లకి ఒకసారి జరుగుతూ వస్తోంది. అయితే, ఆ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ.. నాలుగేళ్లకోసారి నియామకాలు చేపడతారు. ఈ క్రమంలో తీసుకున్న ఇంకో కీలక నిర్ణయం ఏంటంటే… జిల్లా స్థాయి కమిటీలను రద్దు చేశారు. ఇకపై తెరాసకు జిల్లా కమిటీలు ఉండవు. నియోజక వర్గ కమిటీలను ఏర్పాటు చేశారు.
తెరాస తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పార్టీ పదవులన్నీ ఇకపై నాలుగేళ్లకి ఒకసారే నియామకం చేయడం రాజకీయంగా అధినాయకత్వానికి కాస్త వెసులుబాటు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం కూడా ఇదే! ఎందుకంటే, ప్రతీ రెండేళ్ల కోసారి పార్టీ పదవులూ పంపకాల కార్యక్రమాలు పెట్టుకోవడం వల్ల…. పదవులు వచ్చినవారు ఒకలా, రానివారు మరోలా వ్యవహరిస్తూ ఉండటం ఒకింత ఇబ్బందికరంగా మారుతోందని కేసీఆర్ భావించి ఉండొచ్చు. ఎప్పటికప్పుడు తలెత్తే అసంతృప్తులకు ఇలా చెక్ పెట్టొచ్చు. అదే.. నాలుగేళ్ల కోసారి పదవుల పంపకం పెట్టుకుంటే బాగుంటుందన్ని ఆయన ఆలోచనగా చెప్పుకోవాలి. పైగా, పార్టీ అధ్యక్షుడు పదివి కూడా ఇంతకుముందు రెండేళ్లే ఉండేది. ఇప్పుడు నాలుగేళ్లు చేయడం ద్వారా.. మరింత బాధ్యతాయుతంగా పనిచేసే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు.
అయితే, తాజా నిర్ణయం వెనక మరో కోణం కూడా ఇక్కడ మనం చూడాలి. జిల్లా స్థాయి కమిటీలను రద్దు చేశారు. ఇకపై నియోజక వర్గ కమిటీలే ఉంటాయి. అంటే, ఇకపై జిల్లా స్థాయికి బదులు, అంతా నియోజక వర్గా స్థాయి నేతలే ఉంటారు. ఓరకంగా ఇప్పుడు జిల్లా స్థాయి నేతలకు ప్రాధాన్యత తగ్గిపోయినట్టు వారు భావించే అవకాశం ఉంది. నియోజక వర్గమే యూనిట్ గా మార్చుకోవడం వల్ల పార్టీ అధినాయకత్వానికి నిర్వహణ ఈజీ కావొచ్చు. కానీ, ఇదే క్రమంలో నియోజక వర్గ నేతలందరూ పార్టీ అధినాయకత్వంపైనే ఎల్లప్పుడూ ఆధారపడే పనిస్థితి వస్తుంది. అంటూ, ఏ స్థాయి తెరాస నాయకుడైనా కేసీఆర్ వైపే చూడాలి. నిజానికీ ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే అనుకోండి. సో.. ఓవరాల్ గా తనను తాను మరింత బలోపేతం చేసుకుంటూ ఉన్నారని చెప్పొచ్చు