వైఎస్ జగన్‌కి నేర్చుకునే అలవాటు లేదు అనేది టిడిపి నాయకుల నుంచి వినిపించే ఒక ప్రధాన విమర్శ. ఒక్క వైఎస్ జగన్‌కే కాదు…ఆ పార్టీ నేతలందరూ కూడా అలానే ఉన్నారేమోనని అనిపిస్తోంది. ప్రత్యేక హోదా పోరాట దీక్షలు కావొచ్చు, రైతు దీక్షలు కావొచ్చు, ఇతర నిరసన దీక్షలు కావొచ్చు…ఆ దీక్షలకు ఎంచుకుంటున్న డేట్స్ విషయంలో ప్రతిసారీ దెబ్బతింటున్నాడు జగన్. ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా దీక్షకు కూర్చోవాలన్నంత తొందర కూడా ఏమీ లేదు. ఎటుతిరిగీ మూడు నెలలకో, ఆరు నెలలకో ఒకసారి చేసే దీక్షలే కదా. అలాంటప్పుడు తీరిగ్గా ఆలోచించుకుని…ప్రజలకు, తనకు కూడా ఇబ్బంది లేని తేదీలను ఎంచుకోవచ్చు కదా. కానీ జగన్‌తో పాటు ఆయన పార్టీ నాయకులు కూడా ఇంత చిన్న విషయంలో కూడా ప్రతి సారీ తప్పులు చేస్తూనే ఉన్నారు.
ఇంతకుముందు దీక్షల కోసం జగన్ ఎంచుకున్న తేదీలలో అయితే పండగలన్నా ఉండేవి, లేకపోతే పరీక్షలన్నా ఉండేవి. ఆ విషయాలను పట్టుకునే తెదేపా నాయకులు కౌంటర్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం తెదేపా నాయకులకు ఓ బంపర్ ఛాన్స్ ఇచ్చాడు జగన్. ఈ నెల 26, 27 తేదీల్లో గుంటూరులో జగన్ దీక్ష ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ డేట్స్‌ని మే 1,2 తేదీలకు మార్చారు. ఎందుకు అంటే సమాధానం చెప్పే పరిస్థితుల్లో వైకాపా నాయకులు లేరు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టు తీర్పు ఈ నెల 28న రానుంది. అదే టైంలో జగన్ వేసిన పిటిషన్లకు సంబంధించిన విచారణ కూడా జరగనుంది. అందుకే ఈ రైతు దీక్షలను వాయిదా వేసుకున్నారని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఇదే టిడిపి నేతలకు చాలా పెద్ద ఆయుధం అవుతుందనడంలో సందేహం లేదు. అయినా ఇన్ని రోజులు ఆగినవాళ్ళు అంత హడావిడిగా దీక్ష తేదీలు ప్రకటించడం ఎందుకు? ఇప్పుడిలా ప్రత్యర్థి చేతికి ఆయుధాలు ఇచ్చి మరీ అడ్డంగా బుక్కవ్వడం ఎందుకు?