ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టి చూస్తుంటే… తొలిరోజు నుంచే బాహుబలి రికార్డుల వేటకు శ్రీకారం చుట్టేసేటట్టు కనిపిస్తోంది. బాహుబలి 1కి మించిన వసూళ్లు `బాహుబలి 2`కి చూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఓ అంచనాకు వచ్చేస్తున్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.1000 కోట్ల వరకూ వసూలు చేయడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. సినిమా హిట్టయితే… వెయ్యి కొట్టడం బాహుబలి2కి పెద్ద విషయమేం కాదు. అయితే.. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా తొలిరోజే ఈ సినిమా కొత్త రికార్డుల్ని సృష్టించే అవకాశం ఉంది. తొలి రోజున రూ.100 కోట్లు ఈజీగా సాధిస్తుందని చిత్రసీమ లెక్కలు కడుతోంది.
సాధారణంగా పవన్, మహేష్ లాంటి హీరోల చిత్రాలు తొలి రోజున రూ.25 నుంచి రూ.30 కోట్లు వసూలు చేస్తాయి. బాహుబలి 1 దాదాపు రూ.55 కోట్లు కొల్లగొట్టింది. రెండు రోజులకు రూ.100 కోట్లు పూర్తి చేసింది. ఈ ఫీట్ బాహుబలి 2 కేవలం ఒక్క రోజులోనే సాధించే అవకాశాలున్నాయి. బాహుబలి 2 బెనిఫిట్ షోలు భారీగా వేసేందుకు అభిమానులు సన్నద్ధం అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోందని కాబట్టి, బాహుబలి 2ని చూసేయాలన్న ఉత్సాహం అందరిలోనూ రోజు రోజుకీ పెరిగిపోతోంది కాబట్టి.. తొలిరోజు కచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ అందుకొంటుందని చిత్రబృందం ఆశలు పెంచుకొంది. బాలీవుడ్ సినిమాలకు సైతం సాధ్యం కాని… వంద కోట్ల ఫిగర్ ని బాహుబలి 2 కొట్టేస్తే… అది కచ్చితంగా తెలుగువాడి విజయమే.