టిఆర్ఎస్ తాజా ప్లీనరీ లాంచన ప్రాయంగా జరిగిందనే భావన రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి, ఆ పార్టీ అద్యక్షుడు కెసిఆర్ ప్రసంగం కూడా స్థూలంగా ముందే తెలిసిన పథకాల విశదీకరణగానూ వివరణగానూ నడిచింది తప్ప కొత్త వూపు లేకపోయింది. ఇచ్చిన జండాలు ప్రదర్శించాలని, కెసిఆర్‌కు జై కొట్టాలని ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ వంటివారు సూచనలు చేసినా స్పందన పెద్దగా రాలేదు. స్వయంగా కెసిఆర్ ప్రసంగం మధ్యలో ఒకటికి రెండు సార్లు చప్పట్లు కొట్టమని అడగడం, కొట్టిన తర్వాత కూడా చప్పుడు వినిపించడం లేదని వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతుంది. తను చెప్పేవి నోట్సు రాసుకోవడం లేదని కూడా కసిఆర్ చికాకు పడ్డారు. ఇవి మీకు ఉత్సాహం కలిగించడం లేదా అని అడిగారంటే పార్టీ వెలుపల కూడా వాటి ప్రభావం పరిమితంగా వుంటుందని అనుకోవాలా? గత కొంతకాలంగా కెటిఆర్ హరీశ్ రావు అన్నట్టుగా నడిచిన చర్చలు, నిరీక్షకులు చాలా మందికి పదవులు రావడం కూడా ఉత్సాహాన్ని తగ్గించి వుండొచ్చు. కాని వేలమందికి పదవులు వస్తాయన్న మాటమీద ఆశతో చాలా మంది ఎదురు చూపుల్లో వున్నారు. వారికి ఎలాటి ఆశలూ కనిపించలేదు. ముందు జాగ్రత్తగా ఉపన్యాసకులను తగ్గించి తీర్మానాలపై ఉపసంఘాలను ఏర్పాటు చేయడం వల్ల వ్యవహారసరళిలో నడిచిపోయింది. పార్టీ నిబంధనావళిని సవరించి నాలుగేళ్ల వరకూ మళ్లీ పదవుల గోల లేకుండా చేశారు. కెటిఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంటును చేస్తారన్న మాట నిజం కాలేదు గాని పార్టీలోనూ ఆయన పగ్గాలు చేపడతారనే సంకేతాలు ఇవ్వడానికి ఆ చర్చ ఉపయోగపడింది. వూహగానే వుండనివ్వండి అని స్వయంగా కెసిఆర్ విలేకరులతో అనడం బట్టి చూస్తే ఇది నిరాధారం కాదని తెలుస్తుంది. పిసిసి మాజీ అద్యక్షుడు డి.శ్రీనివాస్‌కు కూడా వేదికపై స్థానం దొరకడం గగనమైందంటే ఎంత ఖచ్చితంగా సీట్లు నిర్ణయించారో అర్థం చేసుకోవచ్చు.ఆయన చిన్నబుచ్చుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. వయసు వల్ల అలసట వల్ల ఎండ తీవ్రత వల్ల కావచ్చు- కెసిఆర్ తూలిపడబోయి నిలదొక్కుకోవడం కూడా సెంటిమెంట్లను నమ్మేవారికి ఒక శకునంగా కనిపించవచ్చునేమో! కెసిఆర్ ప్రసంగంలో కాంగ్రెస్‌ను తప్ప బిజెపిపై ఎలాటి వ్యాఖ్యలు చేయకపోవడం భావి వ్యూహాలకు సంకేతమైంది. అదే సమయంలో నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై కేసులు పెడతామని హెచ్చరించడం పొరుగు రాష్ట్రమైన ఎపిలో సోషల్ మీడియాపై దాడిని తలపించింది. ఒకరిద్దరు వక్తలు తప్ప ఎవరూ టిడిపిపైన కూడా ప్రత్యేకించి విమర్శలు చేయకపోవడంలో పరస్పర సర్దుబాటు వుందని కొందరన్నారు.కాని వారిని పట్టించుకోనవసరం లేదనే వదిలేశామని మరికొందరు చెప్పారు.