తమిళనాడు రైతులు 40 రోజులుగా దేశ రాజధానిలో ఆందోళన చేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కోరీతి నిరసన ఎంచుకుంటున్న రైతులు శనివారం నాడు జుగుస్సాకరమైన విధానాన్ని ఆశ్రయించారు. మూత్రం తాగి తమ బాధల తీవ్రతను తెలియజేశారు. జాతీయ బ్యాంకులలో తాము తీసుకున్న రుణాలను రద్దు చేయాలనేది వారి డిమాండ్. ప్రజలకు అన్నం పెట్టే రైతన్న ఇంత దారుణమైన నిరసన తీరును ఎన్నుకున్నప్పటికీ కేంద్రంలో కానీ, సంబంధిత రాష్ట్రంలోనో గానీ ఎందుకు స్పందన లేదు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనే అంశంపై రోజుల తరబడి చర్చించడానికున్న తీరిక రైతన్నల ఇబ్బందులపై లేకపోయింది. అర్ధనగ్నంగానూ, ఎండలో కటిక రోడ్డుపై పడుకుని, వంటి క్లిష్టమైన పద్ధతులను ఆ రైతులు ఎంచుకున్నారు. జనవరిలో జల్లికట్టుపై ఆందోళన చేసినప్పుడు సైతం కేంద్రం మూడు రోజుల్లో దిగొచ్చింది. ఓ సంప్రదాయ క్రీడకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రభుత్వాలు అన్నదాతలకు ఇవ్వడం లేదు. జల్లికట్టు మాదిరిగా రైతులకు యువత మద్దతూ లభించడం లేదు. జల్లికట్టు ఆడకపోతే.. దేశానికీ, ఆ రాష్ట్రానికీ పోయేదేం లేదు. రైతుల ఇబ్బందులు తీర్చకపోవడం కంటే దారుణమైన విషయం మరోటి ఉండదు. కనీసం వారిని చర్చలకు పిలిచి, సముదాయించి వెనక్కి పంపే ప్రయత్నాన్ని కూడా చేయకపోవడం దేనికి సంకేతం. తాజ్ మహల్ ఎదురుగా మూత్రం తాగి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతుల గురించి, కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి వెళ్ళలేదా? అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభంలో తాము వేలు పెట్టడం లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పినట్లు మీడియా తెలియజేస్తోంది. వెంకయ్య గారూ.. ఆ సంక్షోభం మీరు సృష్టించిందే అయ్యుంటే.. ఈపాటికి మీ పార్టీ ఫలితాన్ని అనుభవించి ఉండేది. రైతు గురించి పట్టించుకోకపోతే దేశానికి నష్టం. బీజేపీకి రైతుల ఇబ్బందులపై నిజంగా చిత్తశుద్ధుంటే తక్షణం తమిళ రతుల సమస్యలను తీర్చడానికి ప్రయత్నించండి. అది నెరవేరితే మీకే కాదు ఏ పార్టీకైనా ఆపద్బాంధవిగా పేరొస్తుంది.. ప్రజల మనసుల్లో చోటు దక్కుతుంది. తద్వారా తమిళనాట నాలుగు సీట్లు పొందే అవకాశమూ ఉంటుంది. రాజకీయాల్లో మాత్రమే వేలు పెడతానంటే.. మంచి పేరు కాదు కదా.. శాశ్వతంగా ఆ రాష్ట్రం నుంచే దూరం కావాల్సివస్తుందని గుర్తించాలి.
Subrahmanyam Vs Kuchimanchi