హైదరాబాద్: లిబియాలో తెలుగు ప్రొఫెసర్లు కిడ్నాప్‌కు గురై నెెలరోజులు దాటిపోయినా వారి జాడ ఇంతవరకూ అంతుపట్టలేదు. వారితోపాటు కిడ్నాప్‌కు గురైన ఇద్దరు కన్నడిగులను మూడు రోజుల తర్వాత విడుదల చేసిన తీవ్రవాదులు తెలుగువారినిమాత్రం ఇంకా వదలలేదు. సిర్టే యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈ నలుగురూ జులై నెల 29న ట్రిపోలిద్వారా భారత్‌కు తిరిగిరావటానికి బయలుదేరినపుడు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. కన్నడ ప్రొఫెసర్లు విడుదలైన తర్వాత తెలుగువారుకూడా విడుదలైనట్లు ఒకసారి వార్తలొచ్చాయి. అయితే అది తప్పుడు సమాచారమని తర్వాత తేలింది. శ్రీకాకుళంజిల్లాకు చెందిన గోపీకృష్ణ, కరీంనగర్ జిల్లాకు చెందిన బలరామ్ అనే ఈ ప్రొఫెసర్ల కుటుంబ సభ్యులు అప్పటినుంచి తమవారి కోసం అలమటిస్తున్నారు. ఢిల్లీవెళ్ళి కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కూడా కలిసివచ్చారు. ప్రొఫెసర్లను విడిపించటానికి అన్నిచర్యలూ తీసుకుంటామని సుష్మ వారికి హామీ ఇచ్చారు. అయితే ఆ చర్యలేమయ్యాయో తెలియదు. పది రోజుల క్రితంమాత్రం విదేశాంగమంత్రిత్వశాఖ నుంచి ఒక మెయిల్ వచ్చింది… ప్రొఫెసర్లను తిరిగి తీసుకురావటానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని ఆ మెయిల్లో పేర్కొన్నారు. లిబియాలోని భారత రాయబార కార్యాలయం సిర్టే యూనివర్సిటీతో టచ్‌లో ఉందని మెయిల్లో వెల్లడించారు.
మరోవైపు ఈ ప్రొఫెసర్ల కిడ్నాప్‌పై రెండు వాదనలు వినబడుతున్నాయి. ఒక వాదన ప్రకారం – తీవ్రవాదులు ఈ ప్రొఫెసర్లను ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ బోధించటానికి వాడుకుంటున్నారని చెబుతున్నారు. రెండవ వాదన ప్రకారం – ఈ ప్రొఫెసర్లు వెళ్ళిపోతే స్థానికులకు యూనివర్సిటీలో మంచి బోధన అందదు కాబట్టి తెలుగు ప్రొఫెసర్లను వెళ్ళకుండా చేయటంకోసమే కిడ్నాప్ చేశారని అంటున్నారు. ఈ రెండువాదనలలో ఏది నిజమో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాలి.