ఆమధ్య ట్విట్టర్‌లో దర్శకులు, నిర్మాతలు, గీత రచయితలపై సెటైర్లు వేశారు కీరవాణి. గీత రచయితలు నొచ్చుకొనే మాటలెన్నో మాట్లాడారు. వేటూరి మరణం, సిరివెన్నెల అనారోగ్యంతో తెలుగు సినిమా పాట పడకెక్కిందని ఘాటైన వ్యాఖ్యలే చేశారు. దాంతో చాలామంది గీత రచయితలు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే.. ఇప్పుడు కీరవాణి ‘స్వరం’ మారింది. ఓ ప్రధాన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను గీత రచయితల పక్షపాతి అన్నట్టు మాట్లాడారు. గీత రచయితలకు ప్రతిభ ఉందని, అయితే.. దాన్ని వాడుకోవడం లేదని, వాళ్లకు సరైన పారితోషికాలు ఇవ్వడం లేదని సంగీత దర్శకుడిగా కంటే ఓ రచయితగా తానెక్కువగా గర్వపడుతుంటానని వ్యాఖ్యానించారు కీరవాణి.
అయితే… ఈనాటి గీత రచయితల్లో ప్రశ్నించే ధోరణి లేదని చురకలు అంటించారు. వేటూరి, సిరివెన్నెల అయితే.. ‘ఇదేం కథ’ అంటూ కథ నచ్చకపోతే తిట్టిన సందర్భాలున్నాయని, కానీ ఇప్పటి వాళ్లు సర్దుకుపోతున్నారని, ఆ బాధతోనే తాను ట్విట్టర్‌లో అలా వ్యాఖ్యానించాల్సివచ్చిందని వివరణ ఇచ్చారు కీరవాణి. వ్యవహారం చూస్తుంటే కీరవాణి కాస్త మొత్తబడినట్టే కనిపిస్తోంది. దానికి కారణమేంటో ఆయనకే తెలియాలి.