గుమ్మడి విఠల్ రావు జనసేనలో చేరబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన చేరతానంటే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతుండడం దీనికి పునాది వేసింది. ప్రజా యుద్ధ నౌక బిరుదు పొందిన విఠల్ రావు అసలు పేరు గద్దర్. మావోయిస్టులకు మద్దతుగా ఆయన తన గళాన్ని అంకితం చేశారు. ఇప్పుడు వారితో కటిఫ్ చెప్పానంటున్నారు. కొంతకాలం క్రితం గద్దర్ గుళ్ళలో ప్రదక్షిణలు చేసినట్లూ ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో పూర్తిస్థాయిలో పాల్గొని, ఎంతో ఊపుతెచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశంతోనే మావోయిస్టులతో సంబంధాలు తెంచుకున్నారని అంటున్నారు. పవన్ కల్యాణ్‌తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు గద్దర్‌ను జనసేన దిశగా అడుగులేయిస్తాయనిపిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంచి నేతలు అవసరమే. గద్దర్ అందుకు ఒక మంచి ఉపకరణం కాగలడని పవన్ కల్యాణ్ భావిస్తున్నారంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ గద్దర్‌కు ఏ పార్టీతోనూ ప్రత్యక్ష సంబధాలు లేవు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గద్దర్‌కు తెలంగాణలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తుండడం..పవన్ కల్యాణ్ అందుకు సై అంటున్నారు. జనసేనకు ఆంధ్ర ప్రదేశ్‌లో తిరుగులేని అభిమానముంది. తెలంగాణలో కూడా పాదుకోవడానికి గద్దర్ భాగస్వామ్యం పనికొస్తుందనీ, తద్వారా ఆ ప్రాంతంలో ప్రభావం చూపించవచ్చనీ భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడినట్లే.. తెలంగాణలో చేస్తుందనుకోవడం భ్రమే కాగలదు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరు. ఆంధ్రలో వేరు. ఆంధ్రలో రెండే పార్టీలు ప్రధానంగా పోటీపడతాయి. మిగిలనవన్నీ తోకపార్టీలే. తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్‌లతో పాటూ బీజేపీ కూడా ఉంది. అక్కడ బీజేపీ ఇప్పటికే టీడీపీతో బంధాన్ని తెంచేసుకుంది. ఫలితంగా ఓట్లూ చీలిపోయాయి. టీడీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనమైపోయింది. టీడీపీకి తెలంగాణలో ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతోనే పోటీ చేయాలనుకుంటే, అంతకు మించిన అమాయకత్వం ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఎంపిక చేసిన స్థానాల్లోనే పోటీచేస్తానని అనంతపురం సభలో ప్రకటించిన పవన్ కల్యాణ్ తన ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పారు. రాయలసీమలో మాత్రమే పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థులను పోటీచేయించి, జగన్ ఆయువుపట్టును దెబ్బకొట్లాలనుకోవడం దీని వెనుక వ్యూహమై ఉండవచ్చు. ఇది అంతగా ఫలించే అవకాశం లేదు. గద్దర్‌ను తెలంగాణలో చేర్చుకోవడం ఏపీలో జనసేనకు ప్రతికూల ఫలితాలనిస్తుంది. గద్దర్ జనసేనలో చేరితే ఎటువంటి కొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే. అలా అనుకోవడానికి కూడా ఇది సరైన సమయమూ కాదు.
Subrahmanyam vs Kuchimanchi