గడచిన ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. చంద్రబాబుకు ఛాన్సే లేదనుకున్నారు. అయితే, అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైకాపా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోవడం వల్లనే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అప్పట్లో ఆ పార్టీ నేతలూ విశ్లేషించుకున్నారు. ఆ అనుభవంతో వచ్చే ఎన్నికల విషయమై ఇప్పట్నుంచే వైకాపా జాగ్రత్త పడుతోంది. గత ఎన్నికల్లో మాదిరిగా కాకుండా.. ఈసారి ముందు నుంచే కాస్త ప్రణాళికాబద్ధంగా జగన్ ముందుకు సాగుతున్నారని సమాచారం. ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో అనేది తెలుసుకునేందుకు వ్యూహకర్తల సాయం తీసుకోబోతున్నట్టు సమాచారం.
ప్రముఖ వ్యూహకర్తగా మాంచిపేరున్న ప్రశాంత్ కిషోర్ ను వైకాపా రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. మూడు రోజుల కిందట ఆయన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి వచ్చారు. జగన్ ను కలుసుకుని చాలాసేపు చర్చించారు. అయితే, ఆయన జగన్ ను ఎందుకు కలిశారూ.. ఆ చర్చల సబ్జెక్ట్ ఏంటనే విషయాలు మాత్రం బయటకి రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం… ఇకపై విపక్షాలనికి సంబంధించిన వ్యూహాలన్నీ ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎలాగూ ముందస్తు ఎన్నికలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్నల్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సో.. దానికి అనుగుణంగా ఇప్పటి నుంచే జగన్ ఎలా వ్యవహరించాలో అనేది ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేస్తారట. అంతేకాదు, జగన్ ప్రసంగాలను కూడా ఆయనే అందిస్తారనీ, వస్త్రధారణ, హావభావవ్యక్తీకరణ.. ఇలాంటి విషయాలను కూడా ఆయనే డిజైన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.
అయితే… ప్రశాంత్ ట్రాక్ రికార్డును ఇక్కడ మనం గమనించాలి. నిజానికి, ప్రశాంత్ కిషోర్ ఎక్కడికి వెళ్లినా ఆ పార్టీ లేదా ఆ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తారనే ఇమేజ్ ఉంది. కానీ, యూపీ ఎన్నికల్లో మాత్రం ఆయన వ్యూహాలు బెడిసికొట్టాయన్నది వాస్తవం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతో కలిసి ప్రశాంత్ పనిచేశారు. కానీ, అక్కడ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందే. మరి, ఈయన వ్యూహాలు జగన్ కు ఏ రకంగా సరిపోతాయో వేచి చూడాలి. మొత్తానికి, తన సంస్థాగత సలహాదారులను జగన్ పక్క పెడుతున్నట్టే అనుకోవచ్చా..?