తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలు, బాలకృష్ణ కుమార్తె నారా బ్రహ్మణి వివరణ ఇవ్వడం ఆసక్తికరమైన విషయం. భర్త లోకేశ్ కూడా మంత్రి పదవి చేపట్టిన తర్వాత కూడా ఇలాటి మాటలు ప్రజలు పెద్దగా పట్టించుకుంటారని ఆమె అనుకుంటున్నారేమో తెలియదు. రాజకీయాల మూలస్తంభంపై నిలిచిన కుటుంబంలో ఆమె ప్రత్యక్షంగా ఏం చేశారన్నది ఏమంత ముఖ్యం? అయితే లోకేశ్ కంటే ఆమె చురుగ్గా వుంటారని చలాకిగా మాట్లాడతారని సన్నిహితులు చెబుతుంటారు. అంతేగాక అనేక కీలక విషయాల్లో ఆమె సలహాలు ఇవ్వడమే గాక జోక్యం కూడా చేసుకుంటారట. మంత్రి పదవి కోసం పట్టుపట్టడంలోనూ అత్తా కోడళ్ల పాత్ర వుందట. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బ్రాహ్మణి కీలక పాత్ర వహిస్తున్నారని లోకేశ్ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు రిలయన్స్ రిటైల్ డైరీ వ్యాపారాన్ని కూడా స్వంతం చేసుకున్న హెరిటేజ్ వచ్చే ఏడాది ఆరువేల కోట్ల రాబడి కోసం ప్రణాళికలు రచిస్తున్నట్టు బ్రాహ్మణి చెబుతున్నారు. వాల్యూ యాడెడ్ పదార్థాలైన పెరుగు వంటి వాటిపై కేంద్రీకరిస్తున్నామని, వీటి వాటా 22నుంచి 40 శాతానికి పెంచుతామని ఆమె చెప్పారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో రోజుకు 14 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్న హెరిటేజ్ దక్షిణాదినే గాక ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ముంబాయి పూనా వంటి చోట్ల కూడా విస్తరించనున్నట్టు తెలిపారు. రిలయన్స్‌తో హెరిటేజ్ అవగాహనను ఇటీవలనే కాంపిటీషన్ కమిషన్ ఆమోదించింది.