హైదరాబాద్: అమల తన భార్యకావటం తన అదృష్టమని నాగార్జున అన్నారు. తాను ఏదో మంచిపని చేశానుకాబట్టే అమల భార్యగా దొరికిందని చెప్పారు. ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ తన కుటుంబసభ్యుల విశేషాలను వెల్లడించారు. నాగ చైతన్య, అఖిల్ తన సలహా అడిగినప్పుడో, లేక వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నట్లు అనిపిస్తేనే సలహా ఇస్తానని చెప్పారు. అఖిల్ వినయంతో ఉండటానికి కారణం అతని తల్లి అమలేనని అన్నారు. తను ఈ జీవితం, ఈ ప్రపంచం తదితర విషయాలపై తన తల్లితో ఎక్కువసేపు చర్చిస్తూ ఉంటాడని చెప్పారు. నాగ చైతన్య తల్లి పోలిక అని, అతను మరింత ఫోకస్డ్గా ఉంటాడని, కోపమే రాదని అన్నారు. తనకు కోపం ఎందుకు రాదని తాను అడుగుతూ ఉంటానని, అన్నిటికీ చిరునవ్వే సమాధానమవుతుందని తెలిపారు. ఫిట్నెస్గురించి మాట్లాడుతూ, తాను, అమల ఆరోగ్యంగా ఉండటం తమ అదృష్టమని అన్నారు. కుటుంబసభ్యులందరమూ ఫిట్‌గా ఉండటానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. తాను హెల్త్ కాన్షస్ అని అన్నారు. కార్తి, తమన్నాతో చేస్తున్న మల్టీ స్టారర్లో తాను వీల్‌ఛైర్‌లోనే ఉంటానని తెలిపారు. కౌన్ బనేగా కరోడ్‌పతి మూడో సీజన్ త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. తన జీవితంలో గర్వంగా ఫీలయ్యేది ‘మనం’ చిత్రమని చెప్పారు. పీరియడ్ మూవీ చేయటం తనకు అత్యంత ఇష్టమైన విషయమని నాగ్ అన్నారు.