తెలంగాణలో రాజకీయంగా ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమేం కాదు. కోదండరాం వ్యూహాలూ, పవన్ కల్యాణ్ కసరత్తులూ ఆ రాష్ట్రంలో ఏదో జరగబోతోందని సూచనప్రాయంగా చెబుతోంది. గద్దర్ వస్తానంటే ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ అనడం.. సినిమా నటుడు నితిన్ తెలంగాణలో జనసేన పార్టీకి అధ్యక్షుడిగా రానున్నారని ఈరోజు ఓ వార్త చక్కర్లు కొట్టడం దీన్ని ఇంకా బలపరుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా సహకరించిన పీకే, ఇప్పుడు ఆ పాత్రను తెలంగాణలో తీసుకోబోతున్నారా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ఓటుకు నోటు కేసులో డ్యామేజయిపోయిన చంద్రబాబు ప్రతిష్టను పీకే ఎంతవరకూ ఆ రాష్ట్రంలో పునరుద్ధరించగలడూ అన్న ప్రశ్నకు ఇప్పుడే జవాబు చెప్పలేం. అసలాయన టీడీపీతో చేతులు కలుపుతాడా అనే సందేహమూ వస్తుంది కొందరికి. జాగ్రత్తగా పరిశీలిస్తే… పవన్ కల్యాణ్ కొద్ది నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. ప్రత్యేక హోదా అంటూ విమర్శలు కురిపించాడు. ఉత్తారదంటూ ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనిపై విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు. అదే నోటితో పాపం టీడీపీని ఒక్కమాట అనలేదు. వైయస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులిచ్చినప్పుడు నోరు మెదపలేదు. అమరావతిలో భూసేకరణ నుంచి ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం పోరాడడం వరకూ అన్నీ పద్ధతి ప్రకారం, ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చినట్టు సాగిపోయాయి. దీన్ని గమనిస్తే, పవన్‌ను తెలంగాణలో తురుపు ముక్కలా ఉపయోగించుకోవడానికి టీడీపీ ఎత్తులు వేస్తున్న అనుమానం రాకపోదు. తాజా పరిణామాలు దీన్ని ఇంచుమించుగా రూడీపరుస్తున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అనుభవంతో ఆయన తమ్ముడే అయిన పవర్ స్టార్ ను నమ్మడానికి సిద్ధంగా లేరు. రాజకీయాల్లో ఆయనకు నిలకడ లేదు. గుర్తొచ్చినప్పుడు షెడ్యూలు ప్రకారం షూటింగ్‌కు హాజరయినట్లు రాజకీయ మీటింగులు పెడుతూ ఆవేశంగా నాలుగు మాటలు చెప్పి, కనుమరుగైపోవడాన్నీ ప్రజలు గమనిస్తున్నారు. వీటినన్నింటినీ పరిశీలిస్తే ఆయన ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడతారనే వాదన బలంగా వినిపిస్తోంది. 2004 ఎన్నికల్లో లోక్ సత్తా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీల ఉనికి కారణంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌నుంచి చంద్రబాబు అదే వ్యూహాన్ని 2014లో అమలుచేసి, అధికారంలోకి వచ్చారని పరిశీలకులు ఇప్పటికీ అంటుంటారు. ఇదే ఇప్పుడు పీకే టీడీపీకి తెలంగాణలో దోహదపడబోతున్నారని అంటున్నారు.
మరోవంక ప్రొఫెసర్ కోదండ రాం పార్టీ పెడుతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో భుజభుజం రాసుకుంటూ తిరిగిన ఆయన అనంతర పరిణామాల్లో ముఖ్యమంత్రికి దూరమయ్యారు. ఇలా అనే కంటే కేసీఆరే కోదండరాంను వ్యూహాత్మకంగా పక్కనపెట్టారనడం బాగుంటుంది. కేసీఆర్ చంకెక్కించుకున్న ప్రొఫెసర్ కోదండరామ్ ఊరుకుంటాడా..తాను తయారు చేసిన టీజేఏసీనీ అలాగే కొనసాగించాడు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కేసీఆర్‌కు కోదండరాం చెప్పులో రాయిలా.. కంట్లో నలుసులా.. ఒక రకంగా చెప్పాలంటే ఇంటి పోరులా తయారయ్యారు. తాజాగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ సందేశం ఆయన పార్టీ పెట్టడానికి సిద్దమవుతున్న సంకేతాలను పంపుతోంది. విధివిధానాలను రూపొందించాలనంటూ ఉన్న ఆ సందేశం దీన్ని బలపరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మరోపక్క, కాలిలో ముల్లులా ప్రభుత్వాన్ని అవకాశమొచ్చినప్పుడల్లా సలుపుతోంది.
ఈ పరిణామాలన్నీ ఎటు దారి తీస్తాయో చెప్పడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోగా కొత్త పార్టీ పురుడు పోసుకుని కేసీఆర్ ఓట్లనూ, పవన్ పార్టీ టీఆర్ఎస్ నుంచి యువతరం ఓట్లను ఆకర్షించుకుంటే.. ఆ గణాంకాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముందస్తు ఎన్నికలు వస్తే.. ఎవరికి మేలు చేస్తాయో.. చూడాలి.
Subrahmanyam vs Kuchimanchi