కళా తపస్వి కె.విశ్వనాథ్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వచ్చినందుకు సంతోషించని తెలుగువారుండరు. చాలా మంది శంకరాభరణంతో ఆయనను గుర్తు పెట్టుకుంటారు గాని దానికి ముందు చాలా వుంది. ఎన్టీఆర్‌తో విశ్వనాథ్ అయిదారు చిత్రాలు తీశారని చాలామందికి తెలియకపోవచ్చు. మొదటి చిత్రమే అక్కినేని నాగేశ్వరరావు ఆత్మగౌరవం. కృష్ణతో ఉండమ్మా బొట్టు పెడతా నేరము శిక్ష, శోభన్‌బాబుతో చెల్లిలి కాపురం, జీవనజ్యోతి,కాలం మారింది,శారద తదితర అనేక హిట్ చిత్రాలందించారు. సిరిసిరిమువ్వ,సీతామాలక్ష్మి ఆ తర్వాత శంకరాభరణం ఆయన చిత్రయాత్రను పూర్తిగా మార్చేశాయి. అవన్నీ బాగా తెలిసినవే గనక ఇక్కడ చెప్పబోవడం లేదు. అవన్నీ 10 టీవీ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో చూడొచ్చు.
కాని అంతటి మహా దర్శకుడు కూడా చిత్ర సీమలో తమ పరిస్థితిపై ఆవేదనగా మాట్లాడిన తీరు బాథకలిగించక మానదు. ఇక్కడ మా పరిస్థితి దినదినగండంగా వుంటుందన్నారాయన.ఎక్కడో మాట్లాడుతూ దర్శకుడి జీవితం పంచభర్త్రకలా వుంటుందన్నారే అంటే నిజమేనని మరింత వివరించారు. దర్శకులమీద విమర్శలు చేస్తారు గాని అతను ఎంతమందిని సంతృప్తిపర్చాలో మీకు తెలియదు.రామాయణం తీస్తున్నా సరే జ్యోతి లక్ష్మి డాన్సయినా పెట్టమని అడుగుతారని చమత్కరించారు. నిజానికి సిరిసిరిమువ్వ, సాగరసంగమం వంటి ఆయన చిత్రాల్లో ఇప్పటి సినిమాలు డాన్సులపై చమక్కులుంటాయి. అయితే ఆయనకు నిర్మాత అంటే చాలా గౌరవం. తాను వారి క్షేమం కోరేవ్యక్తినే గాని లేనిపోని భేషజాలు పెట్టుకోనన్నారు. తన నిర్మాతలందరూ మంచి వారు గనకే అలాటి చిత్రాలు తీయడం సాధ్యపడిందని చెప్పారు.
కాని ఈ పరిశ్రమ స్వభావం వేరు. ఈ రోజు మీరేంటన్నదే ఇక్కడ ముఖ్యం. ప్రేక్షకులైనా అంతే. శంకరాభరణం దర్శకుడు కదా ఏదో చిన్న పొరబాటు చేశాడని ఒప్పుకోరు. అందుకే చాలా జాగ్రత్తగా అడుగేయాల్సిందే అని స్పష్టం చేశారు.తనను చాలా మంది తీయమని అడుగుతుంటారని ఎన్ఆర్ఐలు కూడా వచ్చారని అయితే ఇప్పటికి ఏమీ లేదని తేల్చిచెప్పారు.
శోభన్‌బాబుపై గొప్పగౌరవం
ఈ ఇంటర్వ్యూలో నాకు బాగా నచ్చిందేమంటే చెల్లెలికాపురంలో శోభన్‌బాబు ప్రస్తావన వచ్చింది.ఫార్ములాకు భిన్నంగా హీరో నల్లటిపాత్రలో నటించడం గురించి చెప్పగానే అది ఆయన గొప్పతనం అంటూ నమస్కారం పెట్టేశారు. అలాటి ఉత్తముడిని తల్చుకోవడం మంచిపని అన్నారు. ఏ నమ్మకంతో ఒప్పుకున్నారో గాని శోభన్ బాబు వెంటనే అంగీకరించారు. అందాల నటుడు అంత నల్లగానటించారు. కనీసం ఒక డ్రీమ్‌సాంగ్ పెట్టమనైనా అడగలేదు’ అని గుర్తుచేసుకున్నారు. మూగమనసులలో మీ ముద్ర కొన్నిచోట్ల కనిపిస్తుంది అంటే అదేం లేదు అంతా ఆదుర్తి గొప్పతనమే. కాకపోతే ముందు రిహార్సల్ చేసి సెట్ చేసే వాళ్లం గనక ఆ ప్రభావం వుంటుంది. పైగాఆయన ఒకసారి బాధ్యత ఇచ్చాక ప్రతిదానికి పేరు పెట్టే అలవాటు ఆయనకు వుండేది కాదు అన్నారు.