తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోందా..? ఇన్నాళ్లూ ప్రజల తరఫున పోరాటాలంటూ ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ రాజకీయ పార్టీ పెట్టేందుకు బ్యాక్ గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారా..? పార్టీకి సంబంధించిన పనులు మొదలయ్యాయా..? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పాలి. నిజానికి, కోదండరామ్ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశంలో ఉన్నారన్న వార్త కొత్తదేం కాదు. గతంలో ఈ అంశమై చాలా రకాల అభిప్రాయాలు చక్కర్లు కొట్టాయి. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరం ఎంతైనా ఉందంటూ గతంలో కోదండరామ్ వ్యాఖ్యానిస్తూ… కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి కొన్ని సంకేతాలు ఇచ్చారు. అయితే, తాజాగా జరుగుతున్న చర్చ ఏంటంటే.. తెలంగాణ యాక్టివస్టు గాదె ఇన్నయ్య పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ సందేశం!
దీని సారాంశం ఏంటంటే.. కోదండరామ్ భాగస్వామ్యంలో ఏర్పాటు కాబోతున్న పార్టీలో చేరాలనుకునేవారు తమని కాంటాక్ట్ చెయ్యొచ్చూ అనేది! జూన్ నెల తరువాత తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు ఉంటాయంటూ ఇన్నయ్య సోషల్ మీడియాలో విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. త్వరలోనే మరోసారి తెలంగాణలో రాజకీయ వలసలు ఉంటాయని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా మెసేజ్ చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఏర్పాటుకు కోదండరామ్ సిద్ధమౌతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అయితే, పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కథనాలను కోదండరామ్ ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నారు. కొత్త రాజకీయ పార్టీని పెట్టాలనే అంశం ఇంతవరకూ జేయేసీలో చర్చకు వచ్చింది లేదని ఆయన అంటున్నారు. ఇలాంటి కథనాలను, సందేశాలను పరిగణనలోకి తీసుకోవద్దని అభిప్రాయపడుతున్నారు. అయితే, జూన్ నుంచి పార్టీకి సంబంధించిన కొన్ని పనులు ప్రారంభించి.. రకరకాల వేదికల ద్వారా అభిప్రాయాలు సేకరించి.. దశలువారీగా కమిటీలు వేసుకుంటూ ఈ ఏడాది అక్టోబర్ లో పార్టీ ఏర్పాటు ఉంటుందనే వ్యాఖ్యానాలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఏదైతేనేం, మరోసారి కోదండరామ్ పార్టీకి సంబంధించిన చర్చ తెలంగాణ సమాజంలో హాట్ టాపిక్ గా మారుతోంది. నిజానికి, కోదండరామ్ ప్రస్థానం కూడా పార్టీ ఏర్పాటు దిశగానే అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.