చిరంజీవి 151వ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. ఈ సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డి ఖరారైనా, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి స్క్రిప్టు లాక్ అయినా.. ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికి కారణం.. చిరంజీవి లావు తగ్గాలనుకోవడమే నట. తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చినా – ఖైదీ నెం.150లో చెలరేగిపోయాడు చిరు. డాన్సుల్లో ఆకట్టుకొన్నాడు. అయితే కొన్ని ఫ్రేముల్లో మరీ బొద్దుగా కనిపించాడు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డిలో మాత్రం ఈ స్థాయిలో కనిపిస్తే బాగోదు. అందుకే కనీసం మరో ఆరు కేజీలైనా తగ్గాలని టార్గెట్ పెట్టుకొన్నాడట. అందుకోసం చిరు.. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బరువు తగ్గి, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పాత్రకు తగినట్టు మారడానికి చిరుకి కాస్త సమయం కావల్సివచ్చిందట. అందుకే ఈ సినిమా ఆగస్టు వరకూ మొదలవ్వడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఈసినిమాకి సంబంధించిన టెక్నికల్ టీమ్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. సంగీతం, కెమెరా, ఫైట్స్ విభాగంలో బాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహాయం తీసుకోవాలని సురేందర్ రెడ్డి భావిస్తున్నాడట. వాళ్ల డేట్లు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందని, అందుకే ఆగస్టు వరకూ ఆగాల్సివస్తోందని టాక్.