బాహుబలి కి సంబంధించిన కొన్ని యుద్ద సన్నివేశాలు అప్పట్లో లీకవ్వడం సంచలనం సృష్టించింది. `కాపలా దారుడే దొంగతనం చేస్తే మా పరిస్థితి ఏంటి` అంటూ… రాజమౌళి వాపోయాడు. పార్ట్ 2కి సంబంధించి అలాంటి పొరపాట్లేం జరక్కూడదని చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన సర్వర్ జర్మనీలో భద్రపరచారు. ఆ పాస్ వర్డ్ కొంతమందికే తెలుసు. అయినా సరే.. బాహుబలి 2లోని కొన్ని సన్నివేశాలు లీకైపోయినట్టు సమాచారం. సోమవారం రాత్రి నుంచి బాహుబలి 2కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ ఆన్ లైన్లో వైరల్గా తిరుగుతున్నాయి. అవి పార్ట్ 1లో సన్నివేశాలు అనుకోవడానికి వీల్లేదు. పార్ట్ 1లో, పార్ట్ 2 ట్రైలర్లో చూడని సీన్లు… కనిపించడంతో పార్ట్ 2 లీకైందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దాంతో.. చిత్రబృందంలో, ప్రభాస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఈ స్క్రీన్ షాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనే విషయంపై చిత్రబృందం లోతుగా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. బాహుబలి 2 విడుదలకు ముందు.. ఇలాంటి లీకేజీలు జరగడం షాకింగ్ విషయమే.