హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాపరిషత్ సమావేశంలో నిన్న మక్తల్ నియోజకవర్గ(కాంగ్రెస్) ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెంపదెబ్బ కొట్టటాన్ని తెలుగుదేశం ఖండించింది. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీయిజంలో బీహార్‌ను మించిపోయారని విమర్శించారు.
ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు మహబూబ్‌నగర్ ఘటనపై ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి ఈ ఘటనపై చర్చించారు. అధికారపార్టీ నేతల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశం ముగిసిన తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ను కలిశారు. బాలరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడనుంచి నేతలంతా సీఎమ్ క్యాంప్ ఆఫీస్‌కు ర్యాలీగా వెళ్ళి అక్కడ ధర్నా జరిపారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, జానారెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు చిట్టెంను బాలరాజు చెంపదెబ్బ కొట్టటం ఛానల్స్ అన్నింటిలో స్పష్టంగా కనబడుతుండగా, టీఆర్ఎస్ అనుకూల మీడియాలో మాత్రం ఈ ఘటనను – ఇరువురు ఎమ్మెల్యేలు కొట్టుకున్నట్లుగా – ఫైటింగ్‌గా చిత్రీకరించటం విశేషం. రామ్మోహన్ రెడ్డి, బాలరాజు మధ్య వాగ్వాదం జరిగిందని, రామ్మోహన్ రెడ్డి తనను తిట్టి వాటర్ బాటిల్‌తో దాడిచేశాడని గువ్వల బాలరాజు ఆరోపించినట్లు ఆ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.