ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పలేదని మంత్రి,తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వివరణ లేక ఖండనో ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వార్త మీడియాలో విపరీతంగా ప్రచారమైంది. అనుకూల ముద్ర వున్న వాటిలోనూ వివరంగా వచ్చింది. తదుపరి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలోనూ ఇదే విధమైన వాతావరణం కొనసాగింది. ఎన్నోవిషయాలపై మాట్లాడిన చంద్రబాబు దీన్ని మాత్రం ఖండించలేదు. పైగా 2018 మార్చిలో ఎన్నికలు వుంటాయని ముఖ్యమంత్రి స్పష్గంగానే చెప్పారని తెలుగుదేశం ప్రతినిధులు మాలాటి వారితో అన్నారు కూడా. బుధవారం ఉదయం కూడా ఒక నాయకుడు చెప్పారు. మరి అంతా అయ్యాక ద్వితీయ నేతగా వున్న లోకేశ్ నుంచి ఈ మాట వచ్చిందంటే వ్యూహాత్మక ప్రకటనా? లేక పునరంచనా ఫలితమా? కాదంటే ఎందుకైనా మంచిదని అంటున్నారా? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా వుండాలని మాత్రమే చంద్రబాబు అన్నారని లోకేశ్ మరో మాట అంటున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే ఇది జాగ్రత్త కోసం గాని లేకపోతే బిజెపితో బేరసారాలలో బెట్టు కోసం గాని చేసిన ప్రకటనే అనుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఎన్నికలంటే ఏ పార్టీ ఒప్పుకోదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వారం రోజులలోనూ తెలుగుదేశం ప్రతినిధులందరూ ఇంచుమించు బలపరుస్తూనే మాట్లాడారు. మరి వారికి సరైన సమాచారం ఇవ్వలేదా? కాదంటే ఇచ్చింది మార్చుకున్నారా? ఇదే తుదిమాటా లేక రేపు మరో విధంగా మాట్లాడ్డం ద్వారా ప్రతిపక్షాలను గజిబిజికి గురి చేస్తారా? చూడాల్సిందే.