తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడవు.. ఇది తాజాగా మరోసారి రుజువైంది. ఇది ఓ సినిమా అంశంపై. ప్రపంచవ్యాప్తంగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని గురించి. ఇందులోనూ రాజకీయముందంటే నమ్మలేం.
ఆంధ్ర ప్రదేశ్లో రోజుకు ఏకంగా ఆరు ఆటలను ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చేసింది. హైకోర్టు సైతం తన వంతు చేయి వేసింది. మొదటి వారం రోజులూ సాధారణ థియేటర్లలో కూడా బాహుబలి సినిమాకు టికెట్లు పెంచి అమ్ముకోవచ్చని తీర్పిచ్చింది. ప్రపంచ చలన చిత్ర యవనికపై అత్యద్భుత కావ్యమని అందరూ వేనోళ్ళ కొనియాడుతున్నారు. తెలంగాణలో మాత్రం ఠాఠ్ కుదరదంటున్నారు. 5 ఆటలు మాత్రమే ప్రదర్శించాలనీ, టికెట్ ధర పెంచడానికి ససేమిరా అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా టికెట్టు ధర పెంచితే, ఫిర్యాదు చేయండంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రేక్షకులకు సూచించారు.
ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదల కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 9వేల థియేటర్లలో రిలీజవుతోంది. భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలలో మార్మోగిస్తున్న ఈ చిత్రంపై తెలంగాణ శీతకన్నెందుకు వేసింది. గుణశేఖర్ రుద్రమదేవి చలన చిత్రంపై ఏపీ అనుసరించిన వైఖరికీ దీనికీ ఏదైనా సంబంధముందా. ఆ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం వినోదపన్ను మినహాయింపునిచ్చింది. ఏపీ ఇవ్వనంది. బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపన్ను మినహాయించిన ఏపీ ప్రభుత్వం, ఆ తదుపరి ఉపసంహరించుకుంది. చూడబోతే… ఈ చిత్రాల పట్ల అనుసరించి వైఖరే బాహుబలిపై తెలంగాణలో ప్రభావం చూపిస్తోందనిపిస్తోంది. వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డు నెలకొల్పుతుందని భావిస్తుందన్న బాహుబలి ది కంక్లూజన్ గొప్ప సినిమానే అయ్యుండచ్చు కానీ అది సినిమానే అనే అంశాన్ని మరుస్తున్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. రాజకీయమే దీనికి కారణమైతే అంతకు మించిన చిన్నతనముండదు. కాదంటారా! హైకోర్టే మొదటి వారంరోజులు టికెట్ ధరలు పెంచుకోమన్నప్పుడు సర్కారుకు నొప్పేమిటో అర్థం కాని విషయం. దీని అంతరార్థం అందరికీ తెలుసు కానీ, ఎవరూ నోరు మెదపలేరు.. అదీ అసలు దౌర్భాగ్యం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి