ఎన్నికలు ముందుగానే వస్తాయని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరినీ అప్రమత్తం చేస్తే కుమారుడు మంత్రి లోకేశ్ అలా చెప్పలేదని ప్రకటించారు. అనేక వివరణలు ఇచ్చారు. ఆరు నెలలు ముందుగా జరిగితే పెద్ద లెక్కలోది కాదన్నారు. అలాగే కేంద్ర రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం సాధ్యం కాదన్నట్టు మాట్లాడారు. ఇది కూడా ఆ పార్టీ గతంలో చెప్పని మాట. నిన్న తెలుగు360లో చెప్పుకున్నట్టు తండ్రి ప్రకటనను లోకేశ్ సరిచేశారన్నమాట. కాస్త వెనక్కు వెళితే చిత్తూరు జిల్లా ఏర్పేడులో దారుణ ప్రమాదానికి కారకులైన ఇసుక మాఫియా వారికి తెలుగుదేశంతో సంబంధం లేదని లోకేశ్ చెప్పారు. కాని వారిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ప్రమాణ స్వీకారం తర్వాత నెలరోజుల్లోనే రెండు ముఖ్య విషయాల్లో ఇంత తేడాగా మాట్లాడ్డం యాదృచ్చికంగా జరిగివుంటుందా? లేక బిజెపి సంఘ పరివార్‌లో వలె ఒకరు ఒక విధంగా మాట్లాడితే మరొకరు భిన్న స్వరం వినిపించడం తర్వాత సర్దుకోవడం అన్న ఫార్ములా తెలుగుదేశం కూడా మొదలు పెట్టిందా? ఇంకా ఒకటి రెండు సంఘటనల తర్వాత గాని అర్థం కాదు. క్రమశిక్షణ అందరూ ఒకేమాట మీద వుండాలి అని చంద్రబాబు చెబుతుంటారు గాని తండ్రీ కొడుకులే భిన్నంగా మాట్లాడితే ఎవరు ఏమనగలరు పార్టీలో?