2014 ముందు వరకూ కూడా చంద్రబాబు కఠినాత్ముడు, తప్పు జరిగితే సహించడు, తాను నిద్రపోడు…ఉద్యోగులను కూడా నిద్రపోనివ్వడు, క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే స్థాయిలో చంద్రబాబు ఇమేజ్ గురించి చాలా గొప్పగా చెప్పేవారు. చంద్రబాబు కూడా చంద్రబాబు కూడా అదే స్థాయిలో చెప్పుకునే వాడు. కానీ 2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఇప్పటి వరకూ చంద్రబాబు పరిపాలన, వ్యవహార శైలిని పరిశీలిస్తే మాత్రం తెలుగు ముఖ్యమంత్రులందరిలోకి చంద్రబాబే బలహీనంగా కనిపిస్తున్నాడు.
ఉమ్మడి రాజధాని విషయంలో రంకెలేసిన చంద్రబాబు ఓటుకు నోటు కేసు తర్వాత సైలెంట్‌గా దుకాణం సర్దేశాడు. ఇక కేంద్రంతో పోరాటం అనే ఆలోచనే చంద్రబాబుకు లేదు. ఎందుకు భయపడుతున్నాడో తెలియదు కానీ మోడీని కాస్త గట్టిగా అడగడానికి కూడా చంద్రబాబు భయపడుతున్నాడు అన్నది వాస్తవం. బిజెపికి శాశ్విత మిత్రపక్షం శివసేన కూడా మోడీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. కానీ చంద్రబాబు మాత్రం ఎంతసేపూ మోడీ భజన ఎలా చేయాలా అనే ఆలోచిస్తున్నాడు కానీ విమర్శించే ధైర్యం మాత్రం అస్సలు చేయడం లేదు. నీతి అయోగ్ సమావేశం తర్వాత కూడా బాబువి అవే సేం డైలాగ్స్. అత్యంత దిగువ స్థాయిలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశాం అనే మాట్లాడాడు చంద్రబాబు. ఐదేళ్ళ కాలంలో మూడేళ్ళు గడిచిపోయాయి. మోడీ ఏం చేసినా ఇప్పుడే చేయాలి. ఇంకొక్క సంవత్సరం తర్వాత ఎన్నికల మూడ్ వచ్చేస్తుంది. అప్పుడిక బిజెపి బలంగా ఉన్న రాష్ట్రాలకు తప్పితే ఇతర రాష్ట్రాలకు ఏమైనా చేసే అవకాశమే లేదు. 2019లో గెలిపిస్తే అని చెప్పి హామీల వర్షం మాత్రం కురిపించొచ్చు. అంటే ఈ ఐదేళ్ళ కాలంలో పూర్తిగా అన్యాయం జరిగినట్టే. పోలవరం ప్రాజెక్టు పెంచిన అంచనాలను ఇవ్వం అని పార్లమెంట్ సాక్షిగా బిజెపి చెప్పినప్పటికీ ఆ విషయంపైన కనీసం స్పందించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది. ఇంతా చేసి మోడీకి సామంతుడిలా ఉన్న చంద్రబాబు…మోడీకి మిత్రుడో, శతృవో అర్థం కానట్టుగా రాజకీయం చేస్తున్న కెసీఆర్ కంటే ఎక్కువ సాధించింది ఏంటి మాత్రం ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి.
ఇక రాష్ట్ర స్థాయిలో కూడా చంద్రబాబుకు పట్టు లేకుండా పోతోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఇక నాయకుల కుమార రత్నాలు అయితే జనాలకు తెలుగుదేశం పార్టీ అంటేనే విసుగొచ్చేలా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు స్పందన మాత్రం శూన్యం. బాబు భజన పత్రిక ఆంధ్రజ్యోతిలో మాత్రం బాబు ఆవేశపడ్డాడు, కోపంతో రంకెలేస్తున్నాడు, తీవ్రస్థాయిలో మండిపడ్డాడు, అటో ఇటో తేల్చేస్తానన్నాడు లాంటి కామెడీ వార్తలు మాత్రం వస్తూ ఉంటాయి. అంతకుమించి రావెల సుశీల్ బాబు, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప పుత్ర రత్నం…..ఇలా క్రమశిక్షణ తప్పిన ఏ ఒక్కరి విషయంలోనూ బాబు తీసుకున్న చర్యలు ఏంటి ఎవ్వరికీ తెలియని పరిస్థితి. గ్రామ స్థాయి నుంచీ కూడా టిడిపి నాయకులు ఓ స్థాయిలో రెచ్చిపోతున్నారు అన్న నిజం కంటికి కనిపిస్తోంది. ఆ ప్రభావం టిడిపి పార్టీపైన, చంద్రబాబుపైన పడకుండా ఉండాలంటే మాత్రం చంద్రబాబు కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇంకా ఒక్క ఏడాదిలోనే ఎన్నికల సంవత్సరం రానున్న నేపథ్యంలో ఏం చేయడానికైనా బాబుకు మిగిలి ఉన్న సమయం 12 నెలలు మాత్రమే. అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి, టిడిపిలో క్రమశిక్షణ, కేంద్రం నుంచి రావాల్సిన విభజన హామీలు….ఇలా అన్ని విషయాల్లోనూ బాబు నిరూపించుకోవాల్సింది అయితే చాలా ఉంది. ఎంత భజన మీడియా కవరింగ్ ఉన్నా కూడా ఎంతో కొంత సాధించి చూపించకపోతే మాత్రం చంద్రబాబుకు గడ్డుకాలం తప్పకపోవచ్చు.