బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం శతవసంతాల వేడుకల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడకపోగా చేయికూడా వూపకపోవడం ఆయన ప్రతిష్టకు పెద్ద గండి కొట్టింది. మాటల మాంత్రికుడి మౌనం ఏమిటన్న ప్రశ్నకు సమాధానమే లేకపోయింది. మాట్లాడినా కదలినా విద్యార్తులు నిరసన తెల్పుతారనే నిఘా నివేదికల మధ్య నిర్జీవమైన లాంచనంగానే శతవసంతాల వేడక జరిగింది తప్ప ఉద్యమ కేంద్రంలో వుండే చైతన్యం అస్సలు కనిపించలేదు. ఇక ఈ రోజు వరంగల్‌లో భారీ ఎత్తున జరిగిన టిఆర్ఎస్ బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడినప్పటికీ అందులో జోష్ లేదు.. ఒక్కటంటే ఒక్క కొత్త ముక్క చెప్పింది లేదు.అసలు మాట్లాడింది ఆయనేనా అని సందేహం కలిగించేంత పేలవమైన ప్రభుత్వ పథకాల వుటంకింపు, కాంగ్రెస్‌పై దాడి. ఆఖరుకు ప్రజలను ఉత్తేజపర్చడానికి సన్నాసులు వంటి పదాలు వాడినా స్పందన చప్పగానే వుండిపోయింది. చప్పుడు లేని చప్పట్టు అని నేను గతంలో రాసినట్టు ప్లీనరీలోనే పట్టించుకోని అంశాలను విశాలమైన జన సభ పట్టించుకుంటుందని ఆయన ఎలా అంచనా వేశారో తెలియదు. ఎంత సానుకూలంగా చెప్పినా కెసిఆర్ ప్రసంగం నిస్సారంగా నడిచింది. మూడేళ్ల తర్వాత కూడా నాటి వైఎస్ఆర్ మాటలనూ కిరణ్ కుమార్‌రెడ్డి మాటలనూ గుర్తు చేసినా ఫలితం రాలేదంటే వాటి రాజకీయ విలువ తగ్గిందని ముఖ్యమంత్రి గ్రహించడం అవసరం. ప్లీనరీలోలాగే ఇక్కడ కూడా అడిగినా అంతంత మాత్రంగానే చప్పట్లు వచ్చాయి. కారణం ఆయన చెప్పిన దాంట్లో ఒక్కక్షరమైనా కొత్తది కాదు. హరీష్‌రావుకు సభ బాధ్యత అప్పగించిన కెసిఆర్ చివరలో అభినందించేప్పుడు ముందు కడియం శ్రీహరి తదితరుల పేర్లు చెప్పి ఆయనది జోడించడం కూడా పరిశీలకుల దృష్టికి వచ్చింది.శ్రీహరి వంటి సీనియర్ మంత్రి మనసున్న మారాజు అంటూ నాటకీయ భాషలో కెసిఆర్‌ను కీర్తించడం, కెకె తదితరులు కూడా ఆ బాణీనే అనుసరించడం టిఆర్ఎస్లో వాతావరణానికి అద్దం పట్టింది.ఏమైనా ప్లీనరీ అంతంత మాత్రం అనుకుంటే సభా సమీకరణ కూడా స్తబ్దుగానే ముగియడం అధికార పక్షం ఆలోచించుకోవలసిన విషయమే.