తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమ్మ జయలలిత మరణం తరువాత మొదలైన గందరగోళ పరిస్థితి రకరకాల మలుపులు తిరుగుతోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే.. తమిళనాడులో స్థిరమైన రాజకీయ వాతావరణం ఇప్పట్లో నెలకొనేలా లేదు. ప్రస్తుతం సాగుతున్న ఈ హైడ్రామా అంతటినీ కేంద్రంలోని అధికార భాజపా నడిపిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవ్వరూ ఊహించని రీతిలో దినకరన్ కు చెక్ పెట్టారు. ఇప్పుడు ఫ్రెష్ గా మరో టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఆయన ఎవరంటే.. వివేక్ జయరామ్. ఇళవరసి కుమారుడు.
ప్రస్తుతం చిన్నమ్మ శశికళ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అమ్మ మరణం తరువాత శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ, తమిళనాడు రాజకీయాలపై పట్టుకోసం భాజపా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ తరువాత, చిన్నమ్మ జైలుకు వెళ్లింది. అయితే, అక్కడి నుంచే అసలు ఆట మొదలైంది. చిన్నమ్మకు సంబంధించిన ఆర్థిక మూలాలపై కన్నుపడింది. శశికళకు బలంగా ఉన్న శక్తులన్నింటినిటినీ ఒక్కోటిగా టార్గెట్ చేసుకుని నాశనం చేయడమే భాజపా లక్ష్యంగా పెట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు ఇళవరసి కుమారుడుపై కూడా భాజపా ఫోకస్ పెట్టినట్టు తమిళనాట చర్చ జరుగుతోంది.
ఇళవరసి ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. వివేక్ ను ఫ్రెష్ టార్గెట్ గా పెట్టుకోవడానికి కారణం.. ఇళవరసి, శశికళ ఆస్తులకు సంబంధించిన వివరాలన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటారు కాబట్టి. అందుకే, అతడిపై వివధ మార్గాల ద్వారా ఒత్తిడి పెంచితే… శశికళ తమ దార్లోకి వస్తుందనేది భాజపా ఎత్తుగడ కావొచ్చు. ఆ వివిధ మార్గాలేంటనేవి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివేక్ తోపాటు శశికళ కుటుంబానికి బాగా కావాల్సిన మరో వ్యక్తి జయానంద్. చిన్నమ్మకు బాగా హెల్ప్ ఫుల్ గా ఉండే కీలకమైన వ్యక్తుల్లో ఈయనా ఒకరు. వివేక్ తో ఇతడికి పెద్దగా పడదట. దాంతో ఈ ఇద్దరి మధ్యా మరింత దూరం పెంచే ఎత్తుగడలూ వేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత జైన్ హవాలా కుంభకోణాన్ని మళ్లీ తిరగతోడే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఎందుకంటే, ఆ కేసులో ప్రధాన నిందితుడికీ దినకరన్ కీ లింక్స్ ఉన్నాయట. అలా దినకరన్ ని లైన్లో పెట్టుకోవచ్చు. ఇలా చిన్నమ్మ చుట్టూ ఉన్నవారిని రకరకాల మార్గాల ద్వారా తమ గ్రిప్ లోకి తెచ్చుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని అంటున్నారు!