బాహుబలి 1లో అవంతిక పాత్రలో ఆద్యంతం అలరించింది తమన్నా. ఆమెపై తెరకెక్కించి పాట… సినిమాకే హైలెట్. కత్తి తిప్పుతూ వీర నారి పాత్రలో ఒదిగిపోయింది. తమన్నా జోరు చూసి పార్ట్ 2లోనూ అవంతిక పాత్ర చెలరేగిపోతుందనుకొన్నారంతా. తీరా చూస్తే.. `అసలు ఈ సినిమాలో తమన్నా ఉందా?` అనే అనుమానాలు రేకెత్తించేలా సాగింది ఆమె పాత్ర నిడివి. చివర్లో ఎక్కడో రెండు మూడు ఫ్రేముల్లో కనిపించింది తమన్నా. తనకు ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు. తమన్నాది మరీ గుంపులో పాత్రగా మార్చేశారు. నిజానికి తమన్నా పాత్ర తొలి భాగం వరకే అని ముందే చెప్పేశారు. కానీ పార్ట్ 1లో తమన్నా పాత్రని మలచిన తీరు చూసి, ఆ పాత్రకు వచ్చిన స్పందన చూసి పార్ట్ 2లో అవంతిక పాత్ర నిడివి పెంచారని చెప్పుకొన్నారు. కానీ.. అదేం కనిపించలేదు. బాహుబలి 2 ఇంటర్వ్యూల్లో అందరి హడావుడి కనిపించింది గానీ.. తమన్నా మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. దానికి కారణం ఇదేనేమో. ప్రతీ పాత్రనీ పరిచయం చేసి, ఓ పీక్స్‌కి తీసుకెళ్లి, అదే స్థాయిలో ఆ పాత్రకంటూ ఓ ముగింపు ఇచ్చాడు జక్కన్న. కానీ… అవంతికను మాత్రం గాలికి వదిలేయడం కాస్త నిరాశ పరిచే విషయమే. ఈ విషయంలో తమన్నా కూడా అసంతృప్తికి గురయ్యే ఉంటుంది. కాకపోతే ఓ గొప్ప సినిమాలో తనకూ భాగం ఉంది కదా. ఆ సంతృప్తి చాలు.. సర్దుకుపోవడానికి.