బిజెపితో పవన్‌కి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ ఆ పార్టీపైన కోపంతో ఉత్తర-దక్షిణ భారతం అంటూ ప్రజల్లో లేని భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు పవన్. నాయకులపైన కోపాన్ని దేశంపైన రుద్దుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ఏమీ చేయకపోయినా జీ హుజూర్ అంటున్న చంద్రబాబును పల్లెత్తు మాట అనలేని పవన్…బిజెపి పైన ఉన్న కోపంతో జాతీయ సమగ్రతకు భంగం కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు.
‘జాతీయ సమగ్రతకు ఎవరైనా భంగం కలిగిస్తే …ఇప్పటి వరకూ కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం ప్రాణాలర్పించిన వాళ్ళను చూసి ఉంటారు. కానీ దేశం కోసం ప్రాణాలర్పించే మొదటి పిచ్చివాడిని నేనే అవుతా…’ 2014లో జనసేన ఆవిర్భావ స్పీచ్ సందర్భంగా పవన్ పేల్చిన అనేక సినిమాటిక్ డైలాగ్స్‌లో ఇదొకటి. స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం చనిపోయిన వాళ్ళ గురించి పవన్‌కి తెలుసో…తెలియదో…….లేక నంబర్ ఒన్ హీరో అనే పిచ్చిలో ఉండే ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళ పిచ్చికి తగ్గట్టుగా మొదటివాడిని నేనే అని చెప్పాడో ఏమో కానీ పవన్ మాత్రం ఇప్పుడు ఈ పంచ్ డైలాగ్‌ని పూర్తిగా మర్చిపోయాడు. కండువాలు, మాటలు మార్చకపోతే అసలు పొలిటీషియనే కాడని మన సినిమా రైటర్లే బోలెడన్ని పంచ్ డైలాగ్స్ రాశారు. కానీ నేను అలాంటి వాడిని కాదు అని చెప్పిగదా పవన్ రంగప్రవేశం చేశాడు. మోడీ భజన బృందంలో మెంబర్ అయినప్పుడేమో జాతీయ సమగ్రతకు భంగం కలిగితే ప్రాణాలివ్వడానికి కూడా రెడీ అవుతాడు. మోడీతో విభేదాలు వస్తే మాత్రం ఉత్తర భారతీయులపైన తిరగబడండి అని చెప్పి జనాలను రెచ్చగొడతాడా? ఇదేక్కడి రాజకీయం పవన్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గత కొన్ని నెలలుగా చేస్తున్న రాజకీయం అంతా ఇదే. విశాల భావాలు కలవాడిని అని అంటాడు. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా రాజీకయం చేస్తున్నాడు పవన్.
అయినా దేశంలో ఇదొక్కటే సమస్య ఉందా? అలాగే రాష్ట్రంలో వేరే సమస్యలే లేవా? రైతులు, పల్లె ప్రజల కష్టాలు పవన్‌కి తెలియదా? బ్రతకడానికి ఉపాధి లేక, తాగడానికి నీళ్ళు లేక విలవిలలాడిపోతున్నారు ప్రజలు. కంటికి కనిపిస్తున్న, ప్రతి రోజూ మీడియాలో దర్శనమిస్తున్న ఎన్నో సమస్యలు ఉండగా, లేని సమస్యను పట్టుకుని ఊగులాడుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? అలాగని ఆ నరేంద్రమోడీకి దాసుడిలాగా వ్యవహరిస్తున్న తన మిత్రుడు చంద్రబాబుతో తెగదెంపులు చేసుకుని వచ్చెయ్యమని చెప్తాడా అంటే అలా చెప్పడు. అటో ఇటో తేల్చుకుని వచ్చెయ్….మనకు రావాల్సిన వాటిని పోరాడి సాధించుకుందాం అని చంద్రబాబకు కనీసం మీడియా ముఖంగా సలహా ఇచ్చే సీన్ కూడా పవన్‌కి లేదు. అలాంటప్పుడు తెలంగాణా ఉద్యమ సమయంలో తెలుగు ప్రజల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసిన నాయకుల్లాగా, ఇప్పుడు పవన్ కూడా ఉత్తర-దక్షిణ ప్రజల మధ్య గొడవలు వచ్చేలాగా ఎందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నట్టు? పవన్ మాటలను సీరియస్‌గా తీసుకునే కొంతమంది యూనివర్సిటీ విద్యార్థుల మెదళ్ళలోనే ఉత్తర భారతీయ విద్యార్థులపై ద్వేషం పెంచుకునేలా ఎందుకు చేస్తున్నట్టు? తెలంగాణా ఉద్యమ సమయంలో కూడా ఉస్మానియాలో చదువుకుంటున్న సీమాంధ్ర విద్యార్థులను ఏ స్థాయిలో బాధలు పెట్టారో చూశాంగా. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మంది ఉత్తర భారతీయులు ఉన్నారు. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. పవన్‌లాంటి బాధ్యత కలిగిన నాయకుడు అలాంటి ప్రజల ఆలోచనల్లో విషాన్ని ఎక్కించడం ఎంతవరకూ న్యాయం? రాజకీయ మైలేజ్ కోసం దేశ సమగ్రతకే భంగం కలిగించే మాటలు మాట్లాడడం కంటే దిగజారుడుతనం ఇంకేమైనా ఉంటుందా ‘జైహింద్’ పవన్?