తమిళనాడులో మధ్య ప్రదేశ్ తరహా సంఘటనలు పునరావృతమవుతున్నాయా? ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం రాజకీయ కల్లోలానికే పరిమితమయ్యాయనుకున్న పరిణామాలు ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. రెండు రోజుల్లో రెండు మరణాలు ఈ అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. జయలలితకు దగ్గర ఒకప్పుడు పనిచేసిన విశ్వసనీయులిద్దరు సాయన్, కనకరాజు ప్రమాదాలకు గురవడం దీనికి బీజం నాటింది. వేలాది కోట్ల రూపాయల ఆస్తులకు దివంగత జయలలిత విల్లు రాయకపోవడంతో ఎంతోమంది కన్ను పడింది. దక్కినవాడికి దక్కినంత మాదిరిగా మారిపోయింది. ఆమె నెచ్చెలి శశికళ, శశికళ మేనల్లుడు దినకరన్ చిక్కుల్లో పడిన తరవాత ఈ తరహా సంఘటనలు మొదలయ్యాయి.
మహాబలిపురం సమీపంలో జయలలిత గెస్ట్ హౌస్ ఉద్యోగిగా పనిచేసిన కనకరాజు రెండురోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సాయన్ అనే మరో ఉద్యోగి కేరళలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో కుటుంబంతో సహా గాయపడ్డాడు. గెస్ట్ హౌస్ ఉద్యోగిగా ఉన్న కనకరాజుకు అందులో ఎక్కడేమున్నాయో క్షుణ్ణంగా తెలుసంటున్నారు. ప్రణాళిక ప్రకారం ఒక గార్డును హతమార్చి చోరీకి పాల్పడ్డాడని పోలీసులు నిర్థారణకొచ్చారు. అతణ్ణి పట్టుకోవాలనుకునే లోపే శవమైపోయాడు. ఇక్కడితో ఆగిపోయుంటే అనుమానమొచ్చేది కాదు. సాయన్ కూడా రోడ్డు ప్రమాదం బారిన పడడంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. జయలలిత ఆస్తులను కొట్టేసేందుకు ప్రణాళిక రూపొందించుకుని ఉంటారనుకుంటున్నారు.
రాజుల సొమ్ము రాళ్ళపాలైన మాదిరిగా జయలలిత ఆస్తులెక్కడెక్కడున్నాయో ఆనుపానులు తెలిసిన వారు.. ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారి కన్ను సహజంగానే వాటిపై పడింది. ఎలాగైనా దక్కించుకోవాలనే కాంక్షతో ఇప్పుడు పావులు కదుపుతున్నారనిపిస్తోంది.
శశికళ జైలు పాలుకావడం.. దినకరన్ ఎన్నికల చిక్కుల్లో పడి, అరెస్టవడం.. ఇప్పుడు జయలలిత ఇంట్లో చోరీ జరగడం… ఈ మూడింటికీ ఎక్కడో లింకు ఉందనిపిస్తోంది. సాయన్ తరవాత వంతు ఎవరిది. దీనివెనుక ఉన్నదెవరో అనే అనుమానాలు తమిళ ప్రజల్లో ముప్పిరిగొంటున్నాయి.
శశికళ కుటుంబం చిక్కుల్లో లేకపోయుంటే ఇవన్నీ ఆమె దక్కించుకునేదనడంలో ఎటువంటి సందేహమూ లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అస్తులను దొడ్డిదారినైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని ఒక నేర సామ్రాజ్యానికి చెందిన కుటుంబం పాలుకాకుండా చాకచక్యంగా తప్పించిన కేంద్రంపై ఇప్పుడు అదనపు బాధ్యత పడినట్లే. తమిళనాడులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాపం తరహాలో హత్యలకు అవకాశముంది. దీన్ని నివారించాల్సిన బాధ్యత కూడా కేంద్రానిదే. రాష్ట్రం మరో సంక్షోభం దిశగా పోకుండా ఉండడానికి ఏం చేయాలో ముందే ఆలోచించాలి.
జయలలితకు హైదరాబాద్లో కూడా ఆస్తులున్నాయి. అంతకు మించి తెలుగు ప్రజల హృదయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానముంది. ఆమె ఆస్తుల్ని జాతీయం చేసి, ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగిస్తే మేలు. లేకపోతే ఆమె ఆస్తుల చిట్టా కుక్కలు చింపిన విస్తరిలా మారుతుంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి