కొత్తగా ఎపి మంత్రివర్గంలో చేరిన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సంబంధించి కొత్త విషయం వెల్లడించారు. 1999లో చంద్రబాబు నాయుడు విధానం సరిగ్గా లేదు గనక తిరుగుబాటు కుట్ర చేద్దామని ఆయన తమతో కలసి చర్చలు జరిపారని సోమిరెడ్డి చెబుతున్నారు. ఇది నిజమా కాదా అని చెప్పవలసింది కెసిఆర్ మాత్రమే గాని ఆయనకు ఆ ఆసక్తి వుండదు.ఇతరులెవరైనా చెబుతారేమో చూడాలి. సోమిరెడ్డి మామూలుగా టిఆర్‌ఎస్‌పైన కెసిఆర్‌పైన దాడిలో స్పెషలిస్టుగా పేరొందారు. మరి ఆయన ఈ సమయంలో ఇలాటి సంగతి చెబుతున్నారంటే వుద్దేశం ఏమిటి,ఉపయోగంఏమిటి అని సందేహం కలగకమానదు. కెసిఆర్ పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడనేది తెలియని విషయమేమీ కాదు. నిజానికి మనమంతా చంద్రబాబు సూసైడ్ స్క్వాడ్ అని కెసిఆర్ ఎప్పుడైనా అనేవారని టిడిపి సీనియర్ మాజీ ఎంఎల్ఎ ఒకరన్నారు. అంటే రాజకీయాలు ఎంత తలకిందులుగా మారుతుంటాయో తెలుస్తుంది. 1994లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ క్షేమం కోసం లక్ష్మీ పార్వతి కాలి నడక మార్గాన తిరుమల దర్శించినపుడు ఆ బృందంలో కెసిఆర్ వున్నారని మీడియా మిత్రులు చెబుతుంటారు.ఈ రెండు విషయాలు కలిపి చూస్తే కెసిఆర్ వ్యూహప్రతివ్యూహాలు ఎలా వుంటాయో తెలుస్తుంది.ఏది ఏమైనా తర్వాత ఆయన చంద్రబాబుకు దగ్గరయ్యారు. ఒక రిసోర్స్ పర్సన్‌గానూ సహకరించారు. అయితే ఆ రోజుల్లో సలహాలు అడిగి ఎంతో శ్రమపడి అధ్యయనం చేసి తేల్చినవి అమలు చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడిన సందర్భాలు కెసిఆర్ ఒకసారి చెప్పారు. అంతకన్నా ముఖ్యంగా కెసిఆర్‌ను పక్కనపెట్టి విజయరామారావుకు పదవి ఇవ్వడం చంద్రబాబు బ్లండర్ అని చాలా మంది అభిప్రాయం.అలాటివి ఇప్పటికీ ఆయన చేస్తూనే వున్నారని ఈ మద్య కలిసిన కొందరు సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇంతకూ కెసిఆర్ అనుకున్నట్టే 2000 బషీర్ బాగ్ కాల్పుల తర్వాత తిరుగుబాటు చేశారు. కనుక ఈ కథనంలో నమ్మలేనిది ఏమీ లేదు. కాని చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు ఇది వూరికే చెప్పి వుంటారని నమ్మడం కష్టం. ఒక వేళ ప్రశ్న వేసినా దాటేయడం పెద్ద సమస్య కాదు. అడిగిన వారు చెప్పిన వారు కూడా ఒక ఎజెండాతోనే దీన్ని ముందుకు తెచ్చి వుండొచ్చు.