బాహుబలి కోసం రాజమౌళి తరవాత అంతగా కష్టపడింది ప్రభాస్. తన కెరీర్ సైతం పణంగా పెట్టి రాజమౌళి కలల్ని సాకారం చేసే బాధ్యత తన భుజాలపై వేసుకొన్నాడు. ఈ సినిమాతో తనకేం వస్తుంది? ఎంత వస్తుంది? అనే లెక్కల్ని పక్కన పెట్టి ఏకంగా ఐదేళ్లు అహర్నిశలూ కష్టపడ్డాడు. దానికి తగ్గట్టే ఫలితమూ అందింది. ఇప్పుడు ప్రభాస్ ఓ ఇంటర్నేషన్ స్టార్. బాహుబలి 2 తరవాత.. ప్రభాస్ ఆల్మోస్ట్ రిలాక్స్ అయిపోయాడు. అయితే.. గత నాలుగు రోజుల నుంచీ ప్రభాస్ ఫోన్ మోగుతూనే ఉందట. బాహుబలి విడుదలైన తరవాత అభినందనల వెల్లువ తో ప్రభాస్ ఫోన్‌కి విరామం లేకుండా పోయిందట. నిజానికి ప్రభాస్ ఫోన్ నెం అతి కొద్దిమందికే తెలుసు. తెలుగు పరిశ్రమలో కథానాయకులు, దర్శకులు, నిర్మాతల్లో చాలా మంది దగ్గర ప్రభాస్ ఫోన్ నెంబర్ లేదు. అయినా సరే, అతికష్టమ్మీద కనుక్కొని మరీ ప్రభాస్‌కి ఫోన్ చేస్తున్నార్ట. తాను కూడా ఓపిగ్గా ప్రతీ ఫోన్నీ అటెండ్ చేస్తున్నాడని, ప్రతీ సందేశానికీ తిరిగి సమాధానం పంపిస్తున్నాడని ప్రభాస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
సాధారణంగా సినిమా విడుదలైన తరవాత బడా హీరోలు ఫోన్లకు దూరంగా ఉంటారు. స్విచ్చాఫ్ చేసుకొంటారు. ఎలాగూ ఫోన్ల తాకిడి ఉంటుందని తెలిస్తే ముందుగానే అప్రమత్తం అవుతారు. కానీ ప్రభాస్ మాత్రం అందరికీ అందుబాటులో ఉండి, అన్ని ఫోన్స్నీ తానే అటెండ్ చేస్తున్నాడట.. ఓపిగ్గా. ఇంత ఓపిక సహనం ఉంది కాబట్టే బాహుబలి లాంటి సినిమాలు చేయగలిగాడు. సెభాష్.. ప్రభాస్. మరోసారి అందరి హృదయాలూ దోచుకొన్నందుకు.