పొద్దున్నే ఇడ్లీ, వడ..వీటికితోడు సాంబారు కూడా ఉంటే అదుర్స్. లంచ్ లో నవరత్న పలావ్ ఉంటే భేషు… రాత్రి డిన్నరూ… చాల్లే ఆపు, ఎంతసేపూ నీ గురించేనా, ఓసారి అటు చూడు… జమ్మూకాశ్మీరులో మన సైనికులు ప్రతినిత్యం ప్రాణాలకొడ్డి టెర్రరిస్టులతో పోరాడుతున్నారు. అలాంటి పోరాటాల్లో ఒక జవాన్ ఏకంగా పదిమంది టెర్రరిస్టులను కాల్చిచంపేసి చివరకు ప్రాణాలొదిలాడు. అమరవీరునికి శాల్యూట్ చేస్తూ ఇది చదవండి.
జమ్మూ కాశ్మీర్ లోయ ప్రాంతంలోని అడవుల్లో కొండల్లో నక్కినక్కి వీలుచిక్కినప్పుడల్లా దాడులుచేస్తున్న ముష్కరమూక పనిబట్టిన సాహస జవాన్ ఇతను.దేశాన్ని అల్లకల్లోలంచేయాలన్న లక్ష్యంతో సరిహద్దులుదాటేసి, చాటుమాటుగా స్థావరాలను ఏర్పాటుచేసుకున్న టెర్రరిస్టుల గుండెల్లోకి బులెట్లు దించిన పోరాటయోధుడితను. కేవలం 11రోజుల వ్యవధిలో పదిమంది ఉగ్రవాదలను కడతేర్చి అమరుడైన సాహస జవాన్ ఇతను. వరుసుగా మూడుసార్లు ఉగ్రమూకలపై విరుచుకుపడి చివరకు కాశ్మీర్ వ్యాలీలో నేలకొరిగి భారతమాత రుణంతీర్చుకున్న ధీరుడితను.
ఇతనిపేరు నాయిక్ మోహన్ నాథ్ గోస్వామి. ఉత్తరాఖండ్ లోని ఓ పల్లెలో పుట్టాడు. ఆర్మీలో చేరాక పులిలా మారాడు. కాశ్మీరులోయలోని కుప్వారా జిల్లాలోని హాఫ్రుడా కారడవుల్లోకి ఉగ్రవాదులు చొచ్చుకొచ్చారనన్న వార్త అందగానే భారతసైనికదళానికి చెందిన ప్రతేయక దళాలు రంగంలోకి దిగాయి. ఇతర జవాన్లతోపాటు గోస్వామి పులిలా పంజావిసిరాడు. అయితే, ఉగ్రవాదులకూ, స్పెషల్ కమాండోలకి మధ్య జరిగిన భీషణపోరులో గోస్వామి కన్నుమూశారు. అయితే ఈ వీరజవాన్ నేలకొరిగేలోపునే నలుగురు ఉగ్రవాదలను మట్టికరిపించాడు. గోస్వామి ప్రాణాలను తెగించి పోరాడినతీరు సైనికాధికారులను సైతం నెవ్వరపరిచింది.
ఉగ్రవాదులకు ముచ్చెమటలు
కేవలం 11రోజుల వ్యవధిలో జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో వరుసుగా చెప్పట్టిన మూడు కూంబింగ్ ఆపరేషన్స్ లో పదిమంది టెర్రరిస్టులను తుదముట్టించాడు స్పెషల్ కమాండో గోస్వామి. జమ్మూకాశ్మీరు సరిహద్దులవద్ద ఉగ్రవాదుల చొరబాటు, వారిని నిలవరించేపనిలో ఎదురుకాల్పులు జరపాల్సిరావడం కొత్తేమికాదు. కాకపోతే రెండువారాల్లోపే మూడు ఎన్ కౌంటర్లలో పాల్గొని ముష్కరలను హడలెత్తించిన సాహసిగా మాత్రం గోస్వామి నిలిచిపోయాడు. ఈ ఎదురుకాల్పుల సంఘటనల్లోనే ఒక ఉగ్రవాది (సజ్జద్ అహ్మద్ )ప్రాణాలతో పట్టుబడ్డాడు. సజ్జద్అహ్మద్ అనే ఈ టెర్రరిస్టు పాకిస్తాన్ నుంచే వచ్చినట్టు ఆధారాలుకూడా లభించాయి. లష్కరి యీ తోయిబాకు చెందిన ఈ ఉగ్రవాది పాకిస్తాన్ లోని ముజాఫర్ ఘడ్ కు చెందినవాడిగా తెలుస్తోంది.
ఆగస్టు 23న హన్ద్వారా ప్రాంతంలోని ఖుర్మూర్ దగ్గర ఉగ్రవాదల అంతుతేల్చడానికెళ్ళాడు గోస్వామి. ఈ పోరాటంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఆతర్వాత వెంటనే 26-27తేదీల్లో కూడా మరోచోట ఉగ్రవాదులను అంతమొందించడానికి బెల్ట్ బిగించాడు గోస్వామి. మరో ముగ్గురిని హతమార్చాడు. అతను వరుసగా చెపట్టిన ఈ రెండో ఎదురుకాల్పుల్లోనే పాక్ ఉగ్రవాది సజ్జద్ అహమ్మద్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఆ వెంటనే మూడోసారి మళ్ళీ ప్రాణాలకు తెగించి ఉరికాడు గోస్వామి. ఈ ముడవ ఎన్ కౌంటరే అతనికి చివరదైంది. తీవ్రస్థాయిలోజరిగిన ఎదురుకాల్పుల్లో గోస్వామి నలుగురు ఉగ్రవాదులను అంతమొందించి తానూ నేలకొరిగాడు.
శత్రువులపాలిట మృత్యుపాశం
కమాండో గోస్వామి 2002లో ఇండియన్ ఆర్మీలో చేరారు. చాలాతక్కువ సమయంలోనే శత్రువులపాలిట మృత్యుపాశంగా నిలిచాడు. శత్రువని అంతమొదించడంలో ఏచిన్న అవకాశాన్నికూడా వదులుకునేవాడుకాడతను. మోహన్ నాథ్ గోస్వామి భౌతికకాయాన్ని భారతసైనిక విమానంలో బారేల్లీకి సైనిక మర్యాదలతో తరలించి అక్కడినుంచి హెలికాప్టర్ లో ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ కు తీసుకువెళ్ళారు. అక్కడినుంచి అమరవీరుని బిందుఖట్టాకు తీసుకెళ్లారు. అక్కడే సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరజవాన్ గోస్వామికి భార్య, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. ఉత్తరాఖండ్ కార్మికశాఖమంత్రి హరిష్ చంద్ర దుర్గాపాల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం చైర్మన్ ప్రయాగ్ దత్ భట్, జిల్లా మెజిస్ట్రేట్ దీపక్ రావత్, రక్షణశాఖ సిబ్బంది, స్థానికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ అమరజవాన్ ను దేశం ఎన్నటికీ మరచిపోదు. గ్రేట్ శాల్యూట్ టు కమాండర్ గోస్వామి.
– కణ్వస