శాసన మండలి…గవర్నర్ వ్యవస్థలపై మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ ఉండేవారు. గవర్నర్ దెబ్బ రుచి చూసున్నారేమో ఆ పోస్టన్నా ఆయనకు అస్సలు పడదు. ఆయనకే కాదు.. చిన్నపిల్లాడు పాకుతూ కాళ్ళకు అడ్డం పడుతున్నట్లుగా గవర్నర్ అధికారాలు ప్రతిపక్ష ప్రభుత్వాలకు కంటకంగానే ఉంటూ వస్తున్నాయి. పెద్దల సభపై ఎన్టీఆర్ ఏకంగా ఒక్క కలంపోటు పొడిచారు. మళ్ళీ డాక్టర్ వైయస్ఆర్ కృపాకటాక్షాలతో ఏపీలో అది పురుడు పోసుకుంది. రాజకీయ శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకూ, తమకు ఇబ్బందులు కలిగించే రాజకీయ నాయకులను ఊరడించేందుకూ అధికార పక్షాలు వాటిని వినియోగిస్తూ వస్తున్నాయి.
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికైతే నేమి.. టీఆర్ఎస్ ప్రభుత్వానికైతే నేమి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని అవే ఇస్తున్నాయి. ఎమ్మెల్యే సీటివ్వలేకపోతే.. ఎమ్మెల్సీ సీటును కేటాయిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. రోశయ్య సైతం శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే ముఖ్యమంత్రిగా ఎదిగారు. 30 ఏళ్ళ వయసొస్తే చాలు మండలి సభ్యత్వానికి అర్హత లభించినట్లే. మండలిలో శాసన సభలో ఉండే సంఖ్య కంఏ సగం సభ్యులుంటారు. గవర్నర్, ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ, స్థానిక ఇలా ప్రాతినిధ్యాలూ ఉంటాయి.
ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తాజాగా ఓ సందేహమొచ్చింది. రాష్ట్రాల్లో శాసన మండలులు అవసరమా అనేదే ఆ సందేహం. ఖర్చు తగ్గించుకోడానికి ఆయనకీ సందేహమొచ్చిందా అనేది ఒక అభిప్రాయం. అవినీతిపై కొరడా ఝుళిపిస్తున్న మోడీ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలలో ఖర్చును అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారా అనేది మరొక శంక. తన సందేహాన్ని తీర్చమన్నట్లుగా మోడీ చంద్రబాబు, కేసీఆర్లకు లేఖ రాశారు. శాసన మండలులు అవసరమా వివరిస్తూ సమాధానం రాయాలనేది ఆ లేఖ సారాంశం. నిజానికి శాసన మండలి కావాలా వద్దా అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడి ఉంటుంది. రాజకీయ అవసరాలు దీన్ని నిర్దేశిస్తూ ఉంటాయి.
దేశంలో ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో మండలి వ్యవస్థ ఉంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ కాశ్మీర్లతో పాటు ఏపీ, తెలంగాణల్లో శాసన మండలులు ఉన్నాయి. వీటిలో మూడు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంతో అధికారం పంచుకుంటోంది. శాసన మండలులను రద్దు చేయాలంటే ముందు తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాటిని మూసేసి, మిగిలిన రాష్ట్రాల జోలికి వెళ్ళాలి. బీజేపీ ఆ పని చేయగలదా. ఉత్తర ప్రదేశ్లో దూకుడుమీదున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ఇందుకు సుముఖంగానే ఉంటారు. ఇటు ఏపీలోనూ, తెలంగాణలనూ అధికార పార్టీలలో సన్నాయి నొక్కుల్ని సవరించడానికి శాసన మండలి సభ్యత్వాలను వినియోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలూ మోడీ లేఖకు ఏం సమాధానం రాస్తాయనేది ఆసక్తికరం. వద్దంటే ఒక తంటా.. కావాలంటే మరో తంటా.. వీటిని వదిలించుకుంటే బోలెడంత ఆదా. మిగిలిన మొత్తాన్ని మరేదో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలకు ఉపయోగించవచ్చు. ఇదీ మోడీ ఆలోచన.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి