పోలవరాన్ని 2018నాటికి పూర్తిచేస్తాం.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ చెపుతున్న మాట. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ.. మీరే కట్టుకోండి… డబ్బు మేమిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలిక చంద్రబాబు అర్థం కాలేదని అనుకోలేం. బహుళార్థసాధక ప్రాజెక్టయిన పోలవరం 2018 చివరకు పూర్తయిపోతే సంతోషమే. కానీ ఎలా పూర్తవుతుంది. ఆర్నెల్లపాటు గోదావరిలో నీరునిండుగా ప్రవహిస్తుంటుంది. నీరు లేని సమయంలో మాత్రమే ప్రాజెక్టు నిర్మాణ పనులు సావకాశముంటుంది. అంటే ఉన్నది ఆరు నెలలు మాత్రమే. వానలు మొదలయ్యాయంటే నదిలో పనులు చేపట్టడం అసాధ్యం. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఉన్న సమయం 18నెలలు. ఇందులో 12 నెలలు పనులు సాధ్యం కావు. ఏడాది ఆరు నెలలు చొప్పున మూడేళ్ళు చేస్తే తప్ప పోలవరం సాకారం కాదు. అంటే 2021నాటికి పని అయితే అయినట్లు. సోమవారం నిర్వహించిన పోలవరం సమీక్షలో ముఖ్యమంత్రికి అసలు విషయం అర్థమైంది కాబట్టే.. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మాహేశ్వరరావును మందలించింది.
ముందే తయారైన కాల్వలు నీటి పరవళ్ళతో కళకళలాడడానికి ఇంకా ఎంతో సమయమున్నదన్నమాట. 2018నాటికి పోలవరం పూర్తికాకపోతే..ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనేందుకు పునాదిని కూడా సిద్ధమై పోయింది. ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో `వేసవిలోనూ గోదావరిలో ఇంత నీరా` అంటూ హాశ్చర్యపోయే వార్తను ప్రచురించారు. నీరుంటే పని సాగదని చెప్పడమే దీని ప్రధానోద్దేశం. ఈ వార్తపై సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. గోదావరి అంత నీరుండడానికి కారణమేమిటో ఓ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషణాత్మకంగా వివరణ ఇచ్చారు. కనీస అవగాహన లేకపోతే ఇలాంటి వార్తలే వస్తాయని చీవాట్లూ పెట్టారు.
కానీ అసలు విషయం ఇదీ.. గోదావరిలో నీరుంటే పోలవరం పనులు వేగంగా సాగవని చెప్పడం ఆ వార్త ప్రచురణ వెనుక ముఖ్యో్ద్దేశం. కాదంటారా!
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి