నంద్యాల ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య చాలా హడావుడి జరుగుతోంది. వైకాపా టికెట్ మీద గత ఎన్నికల్లో గెలిచి, ఆ తరువాత టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణించారు. దాంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే, ఈ సీటు కోసం టీడీపీలో సిగపట్లు కొనసాగుతున్నాయి. తమ కుటుంబానికే టీడీపీ సీటు ఇవ్వాలంటూ భూమా అఖిల ప్రియ వర్గం పట్టుబడుతుంటే… చాన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న తమకు అవకాశం కల్పించాలంటూ శిల్పా వర్గం కూడా ఉడుం పట్టుతో ఉంది. ఈ రెండు వర్గాల మధ్యా సీఎం చంద్రబాబు నాయుడు ఏదో ఒక రాజీ ఫార్ములా కుదిర్చినట్టు కూడా చెప్పుకుంటున్నారు. అధికార పార్టీలో నంద్యాల ఉప ఎన్నికపై ఇంత హడావుడి జరుగుతున్నా… ప్రధాన ప్రతిపక్షమైన వైకాపాలో దీని గురించి చర్చే లేదు! కారణం ఏంటి..? ఇది జగన్ వ్యూహాత్మక మౌనమా..? లేదా, వేరే పరిణామాల గురించి ఎదురు చూస్తున్నారా..? ఇలాంటి ప్రశ్నలు వైకాపా వర్గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.
నిజానికి, 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా నంద్యాల నుంచి భూమా పోటీ చేసి గెలిచారు. ఇది వైకాపాకి దక్కిన నియోజక వర్గం. అయితే, ఫిరాయింపు రాజకీయాల పుణ్యమా అని టీడీపీలోకి భూమా వెళ్లిపోయారు. దాంతో నంద్యాల నుంచి వైకాపాకి ప్రాతినిధ్యం లేనట్టే అయింది. కానీ, సంస్థాగతంగా వైకాపాకి నంద్యాలలో మంచి పట్టు ఉంది. అయినా సరే, అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్ మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగేది ఎవరూ అనేది ఇప్పటికే ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
అయితే, జగన్ వ్యూహం మరోలా ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు! నంద్యాల టికెట్ విషయమై టీడీపీలో చీలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది కదా. శిల్పా, భూమా వర్గాల్లో ఒక వర్గం తీవ్ర అసంతృప్తికి గురి కావడం ఖాయం కదా. ఆ అవకాశాన్ని వైకాపాకు అనుకూలంగా మార్చుతూ… చీలిక వర్గానికి టిక్కెట్టు ఇస్తే, గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని జగన్ భావిస్తూ ఉండొచ్చు. నిజానికి, శిల్పా వర్గానికి వైకాపా తరఫున ఇప్పటికే టికెట్ ఆఫర్ చేసినట్టుగా కూడా ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. టీడీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చలేదు కాబట్టి.. ఆ అవకాశం కోసం జగన్ ఎదురు చూస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది.
రాజకీయంగా ఈ ఎత్తుగడ సరైందే కావొచ్చు. కానీ, నంద్యాల స్థానం వైకాపాది. ఉప ఎన్నికల్లో గెలుపు ధీమాతోనే వైకాపా ఉంది. అలాంటప్పుడు, ఎవరో చీలిక నేత వస్తారని ఎదురుచూడ్డం ఎంతవరకూ కరెక్ట్ అవుతుందో వారికే తెలియాలి. పార్టీ నమ్ముకుని పనిచేస్తున్నవారిని అభ్యర్థిగా ప్రకటిస్తే మంచిది. ఎందుకంటే, టీడీపీ చీలిక వర్గానికి వైకాపాలో ప్రాధాన్యత ఇస్తే… వైకాపాలో కూడా చీలిక రాకుండా ఉంటుందన్న ధీమా ఉందా..?