వంశీకి భలే మంచి టేస్టుంది. ఆయన ఫ్రేములు కొత్తగా ఉంటాయి. పాటలైతే అత్యద్భుతం. ఇళయరాజా కాంబోలోవంశీ చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్! ఆ పాటలు ఇప్పటికీ వింటూనే ఉన్నాం. పాటల విషయంలో వంశీ టేస్ట్ బాగా మారిపోయిందిప్పుడు. ఇళయరాజా దూరం అవ్వడం, చక్రి చనిపోవడంతో వంశీ టేస్టుకు తగ్గ పాటల్ని ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కొత్తగా మణిశర్మ వచ్చి వంశీ స్కూల్లో చేరాడు. మణి – వంశీ కలసి పనిచేయడం ఇదే తొలిసారి. పాటలెలా ఉంటాయా? అని జనాలంతా ఆసక్తిగా చూశారు. ఇప్పటికి నాలుగు పాటలు విడుదలయ్యాయి. అన్నీ సో..సోనే. నాలుగో పాటలో మాత్రం వంశీ ఓ విచిత్రమైన ప్రయోగం చేశాడు. మేఘాలే తేలే నాలోన… అంటూ సాగిన ఈ పాటని శ్రీమణి రాశారు. ఈ పాటలో పాట ఇలానే ఉండాలన్న రూల్స్ బ్రేక్ చేశాడు వంశీ. గుర్రపు డెక్కల చప్పుడు, రైలు కూతలు, డిష్యూం డిష్యూం శబ్దాలే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా మారాయి. చనిపోయినప్పుడు శ్మశానంలో ఏడుపులు.. వాళ్ల రాగాలు కూడా పాటలో కలిపేశాడు వంశీ. వినడానికీ చూడ్డానికీ ఈ పాట కాస్త వెరైటీగానే ఉంది. అయితే ఈ ప్రయోగం ఏమేరకు ఫలిస్తుందన్నది చూడాలి.