ఎంతటి తాతలైనా మనవళ్లకూ మనవరాళ్లకు లోకువేనన్నట్టు తయారైంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పరిస్థితి. వాళ్లందరితో కలసి బాహుబలి2 చిత్రాన్ని బెంగుళూరులోని ఒరియన్మాల్లో గోల్డెన్లైన్లో ఆయన చూశారట. చూస్తే చూశారు గాని 40 మందితో వెళ్లారని, ఒకో టికెట్కు రు.1050 చెల్లించారని దుమారం రేగింది. ఇది ఆయన ప్రభుత్వమే నిర్ణయించిన రు.200 గరిష్ట టికెట్ ధరకంటే చాలా రెట్లు ఎక్కువ. ఇలా రాష్ట్రాధినేతలే ఎగబడి పోయి చూసేస్తే ఇక సామాన్యులకు టికెట్ల రేట్లు ఎలా తగ్గుతాయని విమర్శకులు విరుచుకుపడ్డారు సహజంగానే. దాంతో ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అనధికారికంగా వివరణ ఇచ్చారు.మనవల ఒత్తిడి తట్టుకోలేకనే వారితో కలసి చూసేందుకు ఆయన వెళ్లారు. వెంట కొడుకు కోడులు పిల్లలు తప్ప ఇతరులు లేరు అని చెప్పారు. ఇంతకూ టికెట్కు ఎంత ఖర్చు పెట్టారంటే ఆ సంగతి మాత్రం ససేమిరా చెప్పేమంటున్నారు. పోనీ మీరైనా చెప్పండయ్యా అని కర్ణాటక ఫిలిం చేంబర్ ఎగ్జిబిటర్స్ కౌన్సిల్ వంటి సంస్థలను అడిగితే అవి కూడా తప్పుకుంటున్నాయి. ఇంతకూ సిద్ధరామయ్యనే ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమర్పించినప్పుడు టికెట్లకు ఈ రేటు పెట్టారు. మరి దాన్ని ఆయనే ఉల్లంఘించారన్నది ఇక్కడ ఆరోపణ. నిజం బాహుబలికే తెలియాలి గాని ఆ సినీమానియా ఏ స్థాయిలో వుందో మటుకు మనకు తెలుస్తుంది. ఇంతకూ ముఖ్యమంత్రులు కూడా ఇంత అవస్థపడే పరిస్థితి మన దగ్గర లేదు మరి!