ఈశ్వర్ నుంచి బాహుబలి 2 వరకూ.. ప్రభాస్ పయనం గమనిస్తే.. అంచెలంచెలుగా ఎదిగిన విధానమే కనిపిస్తుంది. వర్షం, ఛత్రపతి, మిర్చి… ఇలా ఒక్కో మెట్టూ ఎదిగిన వైనం కనిపిస్తుంది. బాహుబలిని పక్కన పెడితే – ప్రభాస్ నుంచి రికార్డులు కొల్లగొట్టే సినిమాలేం రాలేదు. బాక్సాఫీసు బద్దలైపోయే వసూళ్లేం అందుకోలేదు. కానీ… బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబుల గురించి తెలియనివాళ్లకు కూడా ఇప్పుడు ప్రభాస్ తెలుసు. ప్రభాస్ బాలీవుడ్లో అడుగు పెట్టినా.. అక్కడ కూడా డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుస్తున్నారు. ప్రభాస్ పాత సినిమాలకు యూ ట్యూబ్‌లో గిరాకీ పెరుగుతోంది. గుజరాత్ లాంటి రాష్ట్రాలలో కూడా ప్రభాస్‌కి అభిమాన సంఘాలు ఏర్పడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు బొమ్మ మరో ఎత్తు. బ్యాంకాక్‌లో ఇప్పుడు ప్రభాస్ మైనపు బొమ్మ కొలువు తీరింది. ఇంటర్నేషనల్ స్టార్స్‌కి సైతం దక్కని అరుదైన గౌరవమిది. మన సూపర్ స్టార్లు, మెగా స్టార్లు కూడా చూడని.. అరుదైన స్టార్ డమ్ ఇది. ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్లో సినిమా చేస్తానంటే – ఎగరేసుకుపోవడానిక బడా నిర్మాతలు, దర్శకులు సిద్దంగా ఉన్నారు. అదీ… ఈ బాహుబలి స్టామినా. కేవలం బాహుబలి వల్లే ప్రభాస్ ఈ స్థాయికి చేరాడని చెప్పలేం. తన నిడారంబరత, మంచితనం, ఇతరులకు ఇచ్చే గౌరవం, అన్నింటికీ మించి వివాద రహితంగా ఉండడం ఇవన్నీ ప్రభాస్‌లో ప్లస్ పాయింట్లుగా మారాయి. ప్రభాస్‌ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి.