ప్రతీసారీ ఇదే జరుగుతోంది. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది! అదేనండీ… చాన్నాళ్ల తరువాత మరోసారి పవన్ కల్యాణ్ స్పందించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనీ, రైతుల్ని ఆదుకోవాలంటూ ఒక లేఖ రాశారు. అయితే, అది ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి రాశారో తెలీదు! తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు పడుతున్న కష్టాల నేపథ్యంలో రెండు ప్రభుత్వాలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారని అనుకోవాలి. ఇక్కడ అసలు విషయం… పవన్ ఏం రాశారని కాదు! ఈ సందర్భంలోనే ఎందుకు రాశారూ అని! ఈ సందర్భం అంటే… ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రైతు దీక్ష సభ పెట్టిన సందర్భం అనీ!
గుంటూరులో రైతు దీక్ష సభలో జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సరైన మద్దతు ధర లభించడం లేదంటూ, అన్నదాతల ఆర్తనాదానాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ దీక్ష చేశారు. ఆ తరువాత, మధ్యాహ్నానికే నిమ్మరసం పుచ్చుకుని దీక్ష విరమించారు. సరిగ్గా, సాయంత్రం అయ్యేసరికి పవన్ కల్యాణ్ లేఖ మీడియాకు విడుదలైంది. అంతవరకూ జగన్ దీక్ష గురించి ప్రసారం చేసిన ఎలక్ట్రానిక్ మీడియాలో పవన్ లేఖ ప్రముఖ వార్తగా మారిపోయింది!
మొదట్నుంచీ ఇదే జరుగుతూ వస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ ఏయే అంశాలపై స్పందించి పోరాటం చేయాలో… ఆయా అంశాల్లోకి జనసేనాని ఎంట్రీ ఇచ్చేస్తుంటారు. ప్రతిపక్షం కంటే క్రియాశీల పాత్ర పోషించేస్తున్నట్టు వీలైతే మాట్లాడేస్తారు. కాకపోతే ట్వీట్ పెట్టేస్తారు! పవన్ స్పందించారహో అంటూ మీడియాలో రొటీన్ హడావుడి కథనాలు! చంద్రబాబును ఇరకాటం పెట్టే రేంజిలో ఎక్కడైనా వ్యతిరేకత వ్యక్తం అవబోతోందన్న తరుణంలోనే పవన్ ఎంట్రీ ఇస్తుంటారు. ఇది కాకతాళీయంగా జరుగుతున్నా.. పక్కా ప్లాన్ తో జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీ తలకెత్తుకోవాల్సిన అంశాల్ని మాత్రమే పవన్ టచ్ చేస్తుంటారు అనే అభిప్రాయం కలుగుతోంది.
ఆ మధ్య విశాఖలో జరిగిన ప్రత్యేక హోదా పోరాటమే తీసుకున్నా.. అంతకముందు తుందుర్రు ఆక్వా రైతుల సమస్యే తీసుకున్నా.. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలే తీసుకున్నా.. ఇలా ఒకటనేంటి, రాజధాని నిర్వాసితుల సమస్య దగ్గర నుంచీ నేటి మిర్చి రైతుల గిట్టుబాటు ధరల వరకూ ప్రతీ అంశంలోనూ పవన్ స్పందిస్తున్నారు. నిజానికి, ఆయన స్పందనను ఎవ్వరూ తప్పుబట్టరు, స్పందించ కూడని అంశాలు అని కూడా ఎవ్వరూ చెప్పరు. కానీ, ప్రశ్నించిన సందర్భాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటున్నది. పోనీ.. పవన్ ప్రశ్నించిన తరువాత ప్రభుత్వం జవాబు ఉండదు. ఆ స్పందన కోసం పవన్ కూడా ఎదురు చూడరు! మారు మాటాడిన సందర్భాలూ లేవు.
చంద్రబాబుకు ఇబ్బందికరమైన ఇష్యూ ఏదైనా తెరమీదికి రాబోతోందంటే, దాన్నుంచి కాపాడటం కోసమే పవన్ వెలుగులోకి వస్తుంటారూ, ప్రశ్నిస్తుంటారూ అనే విమర్శ మొదట్నుంచీ ఉంది. దాన్ని పూర్తిస్థాయిలో తుడుచుకునే ప్రయత్నం ఇప్పటికీ పవన్ చేయడం లేదనే అనిపిస్తోంది. ఇలాంటి ముద్రతోనే ముందుకెళ్తుంటే… వచ్చే ఎన్నికల్లో జనసేనకు సోలో పర్ఫార్మెన్స్ కు ఆస్కారం ఎక్కడుంటుంది..? జనసేనకు సొంత అజెండా అంటూ ఏముంటుంది..?