తెలుగుదేశం పార్టీని స్థాపించింది నందమూరి తారక రామరావు. ఆ తరువాత, ఎలాంటి రాజకీయ నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వెళ్లిందనేది అందరికీ తెలిసిందే! అయినాసరే, ఇప్పటికీ ఎప్పటికీ ఎన్టీఆర్ ఫొటో, విగ్రహం లేకుండా టీడీపీ మనలేదు అనేది వాస్తవం. అయితే… ఇలాంటి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ ప్రాధాన్యత ఏంటీ, ఎన్టీఆర్ వారసులకు దక్కుతున్న స్థానం ఏది అనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చేలా చేశారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని!
గుంటూరులో జరిగిన రైతు దీక్ష కార్యక్రమంలో కొడాలి నాని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎలాగోలా చేజిక్కించుకున్నారుగానీ, ఆయనే సొంతంగా పార్టీ పడితే పరిస్థితి వేరేలా ఉంటుందని నాని అన్నారు. కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి వదిలేసి, సొంత పార్టీ పెడితే చంద్రబాబు పరిస్థితి దయనీయంగా మారిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. జయంతికీ వర్థంతికీ తేడా తెలియని లోకేష్ ను మంత్రి చేశారనీ, ఆయన రాష్ట్ర సమస్యల్ని ఎలా పరిష్కరిస్తాడంటూ ఎద్దేవా చేశారు.
మొత్తానికి, టీడీపీలో ఎన్టీఆర్ ఫ్యామిలీ ప్రాధాన్యత అనే ఇష్యూని మళ్లీ తెరమీదికి తెచ్చారు. నిజానికి, ఈ ఇష్యూని మొదట్నుంచీ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు! ఈ మధ్యనే, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీయే శేఖర్ అంశం తెరమీదికి వచ్చినప్పుడు కూడా ఇదే టాపిక్ చర్చకు వచ్చింది. బాలయ్య సోలోగా దూసుకుపోతున్నారు కాబట్టి, పార్టీలో మరో శక్తి కేంద్రంగా తయారు కాకూడదని కళ్లెం వేయడం కోసమే శేఖర్ ఇష్యూని పెద్దది చేసి.. పియేని తొలగించే వరకూ తీసుకెళ్లారనే విమర్శ ఉంది. ఆ సందర్భంలోనూ టీడీపీలో బాలయ్య ప్రాధాన్యతపై చర్చ మొదలైనా… లోకేష్ మంత్రి పదవి ఇష్యూపై నెమ్మదిగా డైవర్ట్ చేయగలిగారు. లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వాలని బాలయ్య కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చినట్టు కథనాలు వినిపించాయి.
ఇక, జూనియర్ ఎన్టీఆర్ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నారా లోకేష్ పొలిటికల్ కెరీర్ కి పేర్లల్ గా జూనియర్ ఎదిగే అవకాశం ఉందన్న ఆలోచనతోనే అతడిని పార్టీ నుంచి దూరం పెట్టారన్న విమర్శ కూడా ఎప్పట్నుంచో వినిపిస్తూ ఉన్నదే. 2009 ఎన్నికల్లో జూనియర్ ప్రచారం చేశాడు, ఆ తరువాత మహానాడులో జూనియర్ కు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఇటీవల జరిగిన మహానాడులో ఎన్టీఆర్ పేరు ఎక్కడా వినిపించలేదు. ఇక, హరికృష్ణ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన పనిలేదు. ఈ మధ్య పార్టీకి సంబంధించిన ఓ కార్యక్రమానికి ఆయన్ని పిలిచారుగానీ, అక్కడ ఆయనకి దక్కింది ప్రేక్షక ప్రాధాన్యతే.
ఏదైతేనేం, మళ్లీ ఈ చర్చకు కొడాలి నాని తెరలేపారని చెప్పాలి. అయితే, దీని గురించి మీడియాలో ప్రముఖంగా కథనాలు రాకపోవచ్చు. ఇతర టీడీపీ నాయకులు కూడా నాని కామెంట్స్ మీద స్పందించే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ, టీడీపీ క్యాడర్లో, నందమూరి అభిమానుల్లో ఎంతో కొంత చర్చకు మరోసారి ఆస్కారం ఉంటుందని చెప్పొచ్చు.