బాహుబలి ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలై ఇన్ని రోజులైనా టికెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇంటా… బయటా బాహుబలిదే హవా. సినిమా గురించి పది మాటలు మాట్లాడుకొంటే… అందులో తొమ్మిది కచ్చితంగా బాహుబలి గురించే అయ్యింటాయి. అంతటి ప్రభావం, సంచలనం సృష్టించింది బాహుబలి. అయితే… ఈ సినిమాని చూడొద్దంటూ కొంతమంది దర్శకులు మొరపెట్టుకొంటున్నారు. ఇక్కడ కాదు.. కన్నడ చిత్రసీమలో. కావేరీ జలాల వివాదంలో నటుడు సత్యరాజ్ తలదూర్చడం వల్ల.. అప్పట్లో బాహుబలి విడుదలకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. సత్యరాజ్ ముందుకొచ్చి సారీ చెప్పడం వల్ల ఆ వివాదం సద్దుమణిగింది. మరి ఇప్పుడేంటి? ఈ దర్శకులు ఎందుకు బాహుబలిని టార్గెట్ చేశారు? అనుకొంటున్నారా?
వివరాల్లోకి వెళ్తే.. కన్నడ సీమలో బాహుబలి వసూళ్ల వర్షం కురిపించుకొంటుంది. ఏ థియేటర్ చూసినా బాహుబలే కనిపిస్తోంది. ఇది కన్నడ చిత్రసీమలోని కొంతమంది పెద్దలకు మింగుడు పడడం లేదు. బాహుబలి వల్ల కన్నడ సినిమాలకు నష్టం జరుగుతోందని, చాలా సినిమాలు బాహుబలికి భయపడి విడుదలకు నోచుకోలేకపోయాయని కన్నడ దర్శకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన సినిమాని మనం ప్రోత్సహించుకోవాలి గానీ, బయటి సినిమాల కోసం మన సినిమాలకు నష్టం జరిగితే ఊరుకొంటామా అంటూ ప్రాంతీయ వాదాన్ని లాక్కొస్తున్నారు. అయినా ప్రేక్షకులు మాత్రం పట్టించుకొనే స్థితి కనిపించడం లేదు. ఈ వారమంతా అక్కడ బాహుబలి హంగామా కొనసాగే అవకాశాలున్నాయని కన్నడ సినీ వర్గాలు చెప్పుకొచ్చాయి.