రోజుకో మలుపుతిరుగుతున్న షీనా హత్యకేసు ఇంకా కొలిక్కిరాకముందే, షీనా తల్లి ఇంద్రాణి జీవితకథ ఆధారంగా బాలీవుడ్ లో సినిమా తీయడానికి సన్నాహాలుమొదలయ్యాయి. ఇంద్రాణి తన కూతురు షీనా బోరాను హత్యచేసి కారు డ్రైవర్ సాయంతో శవాన్ని ముక్కలుముక్కలుగాకోసేసి వాటిని నిర్మానుష్యంగా ఉండే అటవిప్రాంతంలో పాతరపెట్టారు. ఎంత పకడ్బందీగా హత్యచేసినా చివరకు తీగలాగితే డొంకంతా కదిలింది. ఇంద్రాణి లీలలు ఒకటొకటిగా బయటపడ్డాయి. మీడియా దిగ్గజం ముఖర్జీయానేకాకుండా ఇంద్రాణికి అంతకు ముందే మరో ఇద్దరు భర్తలున్నట్టు విచారణలో తెలుస్తోంది. మరో విషయమేమంటే, షీనాను మొదట్లో తన సిస్టర్ గా లోకానికి పరిచయంచేసిన ఇంద్రాణి ఆ తర్వాత రిలేషన్ షిప్ ని ట్విస్ట్ తిప్పేసి, షీనా తన కూతురంటూ విచారణలో చెప్పడం మరో మలుపు. కాలేజీలో చదువుతున్నరోజుల్లోనే ఒక లాయర్ తో ప్రేమలోపడిందనీ, ఆ తర్వాత షిల్లాంగ్ లో , కోల్ కతలో మరో ఇద్దరితో ప్రేమవ్యవహారం నడిపిందని, ఆమెకు ముగ్గురు భర్తలున్నారని…ఇలా అనేక కథనాలు మీడియాలో వస్తున్నాయి.
వాస్తవ సంఘటనలమీద సినిమాలు తీయాలన్నఆసక్తి సినీరంగంలో ఎప్పటినుంచీ ఉన్నదే. అలాంటప్పుడు రోజుకో మలుపుతిరుగుతున్న షీనా మర్డర్ కేసును సినిమావాళ్లు ఎలావదిలిపెడతారు. అందుకే ఇంద్రాణి వాస్తవ సంఘటన ఆధారంగా సినిమాతీయబోతున్నారు. ఇందులో ఇంద్రాణి (సినిమాలో పేరు మార్చారు) పాత్రలో సంచలనాలకు మారుపేరైన రాఖీసావంత్ నటించబోతున్నది. రాఖీసావంత్ స్వయంగా మీడియాకు ఈ విషయం చెప్పేయడంతో వార్తగుప్పుమంది. ఇంతకీ ఈ సినిమాపేరేమిటో తెలుసా… `ఏక్ కహానీ జూలీకి’ . ఈ సినిమాలో జూలీ పాత్రలో రాఖీ నటించడానికి సిద్ధమవుతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో కీలకపాత్రలో ఆకృతి నాగ్ పాల్ పోషిస్తున్నట్టు తెలిసింది.
ఇంద్రాణి కేసు గురించి సావంత్ రోజూ ఆసక్తిగా తెలుసుకుంటూనేఉంది. వీరిద్దరిమధ్య గతంలో పరిచయంఉంది. పార్టీల్లో కలసినప్పుడు మాట్లాడుకునేవారు. తనను డ్యాన్స్ చేయమంటూ ఇంద్రాణి కోరేదని మీడియా ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ గుర్తుచేసుకున్నారు.
షీనా మర్డర్ కేసు విచారణపూర్తై, దోషులకు శిక్షపడేలోపే మరి ఈ సినిమా తెరకెక్కుతుందా లేక శిక్ష ఎవరికి, ఏమేరకు పడుతుందో తేలిసిన తర్వాతనే పూర్తి కథను సిద్ధంచేసుకుని విడుదలచేస్తారా ?అన్నది ప్రస్తుతానికి తెలియదు. ఇంద్రాణి క్యారెక్టర్ కు రాఖీ సావంత్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టన్న అభిప్రాయం మాత్రం బాలీవుడ్ వర్గాల్లో వినబడుతోంది.
– కణ్వస