పెదపల్లి జిల్లా కలెక్టర్‌గా గత అక్టోబరులోనే నియమితులైన డాక్టర్ విఎస్ అలగు వర్షణిని ఆగమేఘాల మీద బదిలీ చేసి ఖాళీగా పెట్టిన కెసిఆర్ ప్రభుత్వ చర్య తీవ్ర విమర్శకు గురవుతున్నది. అందుకు చెప్పబడుతున్న అదృశ్య కారణం మరింత విపరీతంగా వుంది. తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు నిర్వాసితుల సమస్యపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వడమే ఆమె అపరాధమైపోయినట్టు కనిపిస్తుంది.అళగు వర్షిణి ఈ ఆరుమాసాలలోనూ పర్యటనలు సమీక్షలు చర్చలు బాగా చేస్తున్నారనే పేరు సంపాదించారు. ఓపెన్ క్యాస్టుగనులు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పరిహారం విషయంలోనూ పద్ధతి ప్రకారం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు కూడా చెబుతున్నాయి. ఆన్లైన్లో స్పందన, మహిళలపై సర్వే వంటి చర్యలు గుర్తింపు పొందాయి. అయితే జిల్లా నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న పాలక ప్రముఖులు, ప్రభుత్వ సలహాదార్ల ఒత్తిళ్లకు తలవొగ్గరనే పేరు కూడా వచ్చింది. ఇటీవలనే దళితులకు సంబంధించిన ఒక భూమి కోసం ప్రజా ప్రతినిధి ఆశపడితే ఆమె అడ్డుకున్నారట. ఇవన్నీఅలా వుంచితే అంతర్గాం మండలం గోలివాడలో కాళేశ్వరం పనుల్లో భాగమైన పంప్‌హౌస్ నిర్మాణాలను స్థానిక నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. వారికి మద్దతుగా కోదండరాం వచ్చారు. ఈ ఆందోళన విషయం తెలిసిన అలుగు వర్షిణి తనతో చర్చించడానికి రావలసిందిగా అపాయింట్మెంట్ ఇచ్చి ఆహ్వానించారు.
కోదండరాంను గాని మరికొందరు ప్రతిపక్ష నేతలను గాని కలెక్టర్లు కలుసుకోని పరిస్థితుల్లో ఇది పాలకులకు కోపం తెప్పించింది.తర్వాత ఆమె స్థాన భ్రంశం ఎంత వేగంగా జరిగిందంటే కోదండబృందం అక్కడకు చేరే సరికి ఆమె లేరు! అధికారాలు వుండొచ్చుగాని మరీ ఇంత ఏకపక్షంగా వినియోగించడమేమిటని రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి.ఇతరులను కూడా హెచ్చరించడానికే ఇలా చేసి వుంటారని కూడా అంచనా వేస్తున్నారు.