ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ బుధవారం ప్రారంభించిన మేధా టవర్స్ వెనుక దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ ముందు చూపు ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ నొక్కి వక్కాణించే విజన్ ఉంది. మేధా టవర్స్‌లో ఏడు ఐటీ ఆధారిత కంపెనీలు పని చేయడం ప్రారంభించాయి. 2008లో ఎల్ అండ్ టి, ఏపీఐఐసీ సంయుక్తంగా మేధా టవర్స్‌ను నిర్మించాయి. అప్పట్లో దీని నిర్మాణానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. లక్షా 75వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో నిర్మించిన మేధా టవర్స్‌లో ఎల్ అండ్ టికి 74శాతం వాటా ఉంది. విజయవాడలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించే ఉద్దేశంతోనే అప్పటి వైయస్ఆర్ ప్రభుత్వం టవర్స్‌కు శ్రీకారం చుట్టింది. సమీపంలోనే గన్నవరం విమానాశ్రయం ఉండడం దీనికి అదనపు సౌకర్యం. విదేశీ సంస్థలు చూసేది మొట్టమొదటగా ఈ సౌకర్యాన్నే.
కార్యకలాపాలను ప్రారంభించిన ఏడు ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు మేధా టవర్స్‌లో మొత్తం 42,681 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అద్దెకు తీసుకున్నాయి. రోటోమేకర్-500మందికీ, గ్రూపో ఆంటోలిన్-400మందికీ, ఐఈఎస్-200మందికీ, మెస్లోవా-200 మందికీ, ఈపీ సాఫ్ట్-200 మందికీ, చందు సాఫ్ట్-100 మందికీ, ఎమ్ఐ ఐటీ సొల్యూషన్స్ -50 మందికీ ఉపాధిని కల్పించాయి.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన కొత్తలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. హుద్‌హుద్ తుపాను తీవ్రతను చూసిన కంపెనీలు అక్కడ కాలుమోపేందుకు వెనకడుగు వేశాయి. తిరుపతిలో ఐటీ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు ప్రకటన కూడా అమలుకు నోచుకోలేదు. విజయవాడలో వచ్చిన ఈ ఏడు ఐటీ కంపెనీలనూ విశాఖకు గానీ, తిరుపతికి గానీ మళ్ళించడానికి ప్రభుత్వం యోచించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో చేసిన తప్పునే ఏపీలో కూడా చేస్తున్నట్లు కనిపిస్తోంది. సకల సౌకర్యాలు సిద్ధంగా ఉన్న మేధ టవర్స్‌లో కంపెనీలను ఏర్పాటు చేయడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ, ఒకే చోట నెలకొల్పడాన్ని తప్పిదంగా చెప్పవచ్చు. వచ్చే కంపెనీలనైనా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పడానికి ప్రభుత్వం చొరవచూపాలి. మరోసారి రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా చూస్తే భవిష్యత్తుకు మేలు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి