కాబోయే భారత రాష్ట్రపతి ఎవరు… అంటూ ఈ మధ్య చాలాపేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మనసులో ఉన్నవారు వీరే అంటూ కొన్ని పేర్లు తెరమీదికి వచ్చాయి. మొదట్లో మోహన్ భగవత్ పేరు వినిపించింది. అయితే, ఆయన రేసులోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ పేరు ప్రముఖంగా వినిపించింది. గురు దక్షిణగా మోడీ ఆయన్ని రాష్ట్రపతి చేస్తారంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, తాజాగా సుప్రీం నిర్ణయంతో ఆయన పేరు కూడా తెర మీది నుంచి పక్కకు వెళ్లిపోయింది. సుష్మా స్వరాజ్ తోపాటు మరికొంతమంది నాయకులు పేర్లు ప్రతిపాదనకి వచ్చాయి. అయితే, వాటిపై భాజపా వర్గాల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి. రాజకీయేతర రంగాల నుంచి ఎవర్నైనా ఎంపిక చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సొంత పార్టీ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.
ఇదిలా ఉంటే… జాతీయ మీడియాలో ఒక వార్త ప్రముఖంగా కనిపిస్తోంది. రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చే ఉద్దేశంలో మోడీ ఉన్నారంటూ నేషనల్ మీడియాలో కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరూ అంటే… జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము. ఈమె ఒడిషాకు చెందిన మహిళ. మొదట్లో టీచర్ గా పనిచేశారు. కొన్నాళ్లు జూనియర్ అసిస్టెంట్ గా ఒక ప్రభుత్వశాఖలో పనిచేసి.. తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో చేరిన ఆమె ఒకసారి మంత్రి కూడా అయ్యారు. 2015లో ఆమెని జార్ఖండ్ గవర్నర్ గా నియమించారు. ఆమె నాయకత్వాన్ని ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.
ఇంతకీ, ఈమెని తెరమీదకి తేవడం వెనక మోడీ వ్యూహం ఏదైనా ఉందా అంటే… కచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎలా అంటే… రాష్ట్రపతిని ఎన్నుకోవడం అనేది మోడీ ఒక్కరి చేతిలోనే ఉన్న విషయం కాదు. రాష్ట్రపతిగా ఒక అభ్యర్థిని మోడీ ఖరారు చేసినా.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఇంకో అభ్యర్థిని పోటీకి తెచ్చే ఛాన్స్ ఉండనే ఉంది. ఇక, మిత్రపక్షాలు కూడా కొన్ని పేర్లను పరిశీలనకు పెడతాయి. వారి అభిప్రాయాలూ వినాలి. పోటీ జరిగితే మోడీ బలపరచిన అభ్యర్థికి తక్కువ ఓట్లు పడే ఛాన్స్ ఉంది. అలా కాకుండా, అందరూ ఏకగ్రీవంగా కాదనలేని పేరును తెరమీదికి తెస్తే… అంతిమంగా మోడీ నిర్ణయమే నెగ్గినట్టు అవుతుంది కదా! అందుకే, గిరిజన మహిళ ద్రౌపది పేరును తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమెను అభ్యర్థిగా నిర్ణయిస్తే అటు శివసేన, అకాళీదళ్ వంటి పార్టీలు కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి వస్తుంది.
సో… గతంలో వాజ్పేయి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు మోడీ ఫాలో అవుతున్నట్టు! నాడు రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ ను ఆయన ప్రతిపాదించేసరికి… మిగతా వారంతా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ కూడా అదే బాటలో ఉన్నారు. ఏదేమైనా, ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అయితే కచ్చితంగా మెచ్చుకోదగ్గ పరిణామమే అవుతుంది.