బాహుబలి 2 వెయ్యి కోట్ల సినిమా అవ్వడానికి పరుగులు తీస్తోంది. తొలిభాగం దాదాపుగా ఆరొందల కోట్లకు పైగానే వసూలు చేసింది. మొత్తంగా కలుపుకొనిచూస్తే ఈ రెండు సినిమాలూ దాదాపు రూ.1500 కోట్లు సాధించబోతున్నట్టు లెక్క. ఆర్థికంగా బాహుబలి సినిమాల విషయాన్ని అంచనా వేయడానికి ఈ అంకెకు మించిన ఆసరా ఏముంటుంది? బాహుబలి సిరీస్ తో రాజమౌళి బాగా మిగులుచ్చుకొన్నాడని, భారీ ఎత్తున పారితోషికం తీసుకొన్నాడని, అది రూ.60 కోట్లకుపైమాటే అని రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమౌళి ఈ సినిమా ద్వారా ఎంత మిగిల్చుకొన్నాడో రాజమౌళికీ, ఆ నిర్మాతలకే ఎరుక గానీ.. నిజానికి ఈ ప్రాజెక్టు మొదలెట్టేటప్పుడు పారితోషికం ప్రస్తావనే రాలేదట. బాహుబలిని ఇప్పుడంటే ఆహా ఓహో అని పొగిడేస్తున్నాం, కరిగిపోతున్న రికార్డులను చూసి తరించిపోతున్నాం గానీ.. మొదలెట్టేటప్పుడు మాత్రం భయం భయంగానే ఉందట. ఇంత పెట్టుబడి పెడుతున్నాం… తిరిగి రాబట్టడం కుదిరే పనేనా? అంటూ లెక్కలేసుకొన్నార్ట. ఒకవేళ అటూ ఇటూ అయితే పారితోషికాలు వెనక్కి ఇచ్చేయడానికి రాజమౌళి, ప్రభాస్, రానా సంసిద్దమయ్యార్ట.
అప్పటి వరకూ తీసుకొంటున్న పారితోషికం కంటే.. తక్కువ మొత్తమే ఎగ్రిమెంట్లో రాసుకొన్నారని, పారితోషికాల్ని `త్యాగం` చేయడంతోనే.. బాహుబలి సినిమా మొదలైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి సైతం అంగీకరించాడు. ”మేం చేస్తోంది రిస్క్ అని మాకు తెలుసు. అందుకే పారితోషికాలు తగ్గినా ఫర్వాలేదనుకొన్నాం” అని అసలు గుట్టు విప్పేశాడు. అయితే… బాహుబలి 1 సంచలన విజయం సాధించడం, పార్ట్ 2పై అంచనాలు పెరగడం, దానికీ ఊహించిన దానికంటే ఎక్కువ మార్కెట్టే జరగడంతో.. రాసుకొన్న పారితోషికాల కంటే ఎక్కువ మొత్తం చెల్లించార్ట నిర్మాతలు. ఆ మొత్తం ఎంతన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.