నిర్భయ హంతకులకు ఉరే సరన్నారు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు. అక్షయ్, ముఖేశ్, పవన్, వినయ్ శర్మలకు కిందికోర్టు విధించిన శిక్షను ఖరారు చేశారు. ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చేందుకు నిరాకరించారు. ఇది అత్యంత అరుదైన కేసనీ, దీని విషయంలో రాజీపడలేమనీ స్పష్టంచేశారు. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ఆరుగురు కిరాతకులు మానవత్వం మరిచి నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. గాయాల తీవ్రతనుంచి ఆమె కోలుకోలేకపోయింది. సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. ఈ కేసులో రామ్ సింగ్ అనే ముద్దాయి జైలులోనే ఉరేసుకుని మరణించాడు. మరొకరు మైనరు. శిక్షను పూర్తిచేసుకుని విడుదలయ్యాడు. ఈ కేసులో నిందితులకు ఉరే సరనీ, దీనిని మించిన శిక్ష లేదు కాబట్టి, దీన్నుంచి వెనక్కి పోజాలమనీ న్యాయమూర్తులు చెప్పారు. ఈ తీర్పును నిర్భయ తల్లిదండ్రులు స్వాగతించారు. దేశవ్యాప్తంగా తీర్పు పట్ల హర్షామోదాలు వ్యక్తమయ్యాయి.
నిర్భయ కేసు తరవాత ఆ తరహా నేరాలను అరికట్టడానికి కేంద్రం నిర్భయ చట్టాన్ని రూపొందించింది. అయినా కూడా మహిళలపై అత్యాచారాలు ఆగలేదు. అకృత్యాలకు బ్రేక్ పడలేదు. చట్టం చేయడంతో పాటు మహిళలకు పటిష్ట రక్షణ ఎలా కల్పించగలమనే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అదే సమయంలో ప్రజల వైఖరిలో కూడా మార్పు రావాలి. ఎక్కడైనా అన్యాయం జరుగుతోంటో మనకెందుకనే తత్వాన్ని వీడాలి. ఆపన్నులను ఆదుకునేందుకు ముందడుగేయాలి. అలాంటప్పుడే నేరాల అదుపు సాధ్యం.