రమ్మంటేనే రాజకీయాల్లోకి వచ్చానని అంటున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్! మంత్రి కావాలన్న కోరిక తనకు లేదని చెప్పారు. కానీ, పార్టీ పెద్దలంతా తనను కూర్చోబెట్టి, ఇదే సరైన సమయమనీ రావాల్సిన అవసరముందనీ, పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంటుందనీ ఒత్తిడి చేయడంతోనే రావాల్సి వచ్చిందని లోకేష్ చెప్పారు. అయితే, ఆ సమయంలో తనకు ఒక విషయం గుర్తొచ్చిందనీ, పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే అంటూ చిన్నప్పుడు నాన్నగారు చెప్పేవారనీ అందుకే గ్రామాలకు సేవ చేసుకునే అవకాశం ఉన్న శాఖ ఇమ్మని కోరానని లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కార్యకర్తలని ఉద్దేశించి ఇలా మాట్లాడారు.
ఇంకో ఆసక్తికరమైన మాట ఏంటంటే… మొత్తం ఆటంతా చంద్రబాబు నాయుడు ఆడేస్తున్నారని చెప్పడం! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడతారో అందరికీ తెలుసని చెప్పారు. 60 సంవత్సరాల వయసులో తనకంటే వేగంగా నడిచేస్తుంటారన్నారు. ‘క్రికెట్ లో బ్యాటింగ్ మీరే. బౌలింగ్ మీరే. ఎంపైరింగ్ మీరు. వికెట్ కీపర్ మీరు. స్లిప్ మీరు. థర్డ్ అంపైర్ కూడా మీరే సార్. కొంచెం మాలాంటి యువకులకు ఛాన్స్ ఇవ్వండి సార్’ అంటూ చంద్రబాబుతో సరదాగా ఓసారి మాట్లాడినట్టు చెప్పారు. నిన్నగాక మొన్న ఢిల్లీకి వెళ్లి, అర్ధరాత్రి వరకూ అక్కడ సమావేశాల్లో పాల్గొని, ఆ తరువాత అమెరికా వెళ్లారన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రజల కోసమే అని చంద్రబాబును పొగడ్తలతో ముంచారు.
అంతా బాగానే ఉంది గానీ… క్రికెట్ మొత్తం ఆయనే ఆడేస్తున్నారని లోకేష్ చెప్పడం విశేషం! ఈ కామెంట్ ఏ ఉద్దేశంతో చేశారో తెలీదుగానీ… దీని వెనక వేరే అర్థం ధ్వనించే అవకాశం ఉంది. తన ఆటను కూడా తండ్రే ఆడేస్తున్నారని లోకేష్ చెప్తున్నట్టు అనిపిస్తోంది కదా. మంత్రి పదవిపై ఆశలేదని లోకేష్ చెప్పడం మరీ విడ్డూరం! పిలిచి ఇస్తేనే తీసుకున్నానని చెప్తుంటే వినడానికి నాన్ సింక్ లా ఉంది. ఎందుకంటే, చంద్రబాబుకి ఉన్న ఏకైక రాజకీయ వారసుడు నారా లోకేష్. ఆయన రాజకీయాల్లోకి వస్తారన్నది ఎప్పుడో ఫిక్స్. టీడీపీ నేతలతోపాటు ఏపీ ప్రజలు కూడా మానసికంగా ఎప్పుడో సిద్ధమైపోయారు. అదే క్రమంలో పార్టీ బాధ్యతల్ని దశలవారీగా చినబాబుకి బదిలీ చేయడం చంద్రబాబు కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఎమ్మెల్సీ చేశారు, మంత్రిని చేశారు. ఇలా బిల్డప్ అవుతున్న పొలిటికల్ కెరీర్ అంతా పార్టీ పెద్దల కోరిక మేరకే జరుగుతున్నదా..? ఈ పదవులూ బాధ్యతలపై లోకేష్ కు ఏమాత్రమూ ఆశలేదా..?
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నుంచి నేడు కీలక శాఖలకు మంత్రి వరకూ లోకేష్ ను కీలకం చేస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. కీలక ప్రభుత్వ కమిటీల్లో మంత్రులను సైతం పక్కన పెట్టి చినబాబుకు పెంచుతున్న ప్రాధాన్యతను ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ ఓపెన్ గా ఉన్నప్పుడు… తనకు పదవులంటే ఇష్టమే లేదనీ, బలవంత పెడితే వచ్చాననీ, పెద్దలు ప్రతిపాదిస్తేనే బాధ్యతలు తీసుకున్నాననీ.. ఇలా చెప్తుంటే వినేవారికి ఏమనిపిస్తుంది చెప్పండీ..!