ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా అమలుచేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేటికీ పదేపదే చెపుతున్నారు. హామీల అమలుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు. కానీ హామీల గురించి ఒక మాట చెపుతుంటే, మిగిలినవారు మరొకలాగా మాట్లాడుతున్నారు. ఇంత కాలంగా వెంకయ్య నాయుడు తదితరులు విశాఖకు రైల్వే జోన్ కేంద్రప్రభుత్వం ఏ క్షణంలోనయినా ప్రకటించవచ్చునని చెపుతున్నారు. కానీ ఇప్పుడు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుకి ఇబ్బంది ఉందని, దాని కోసం రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని చెపుతున్నారు. అదే నిజమయితే మరి ఇంత కాలం ఈ సంగతి తెలియకుండానే వెంకయ్య నాయుడు తదితరులు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీలు ఇస్తున్నారా? ఒకవేళ నిజంగా రాజ్యాంగ సవరణ అవసరమయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? ఒకవేళ రాజ్యాంగ సవరణ చేయడం సాధ్యం కాకపోతే ఈ హామీని కూడా పక్కనపడేస్తారా? అనే ప్రశ్నలకు సమాధానలు తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. ప్రత్యేక హోదాకి 14వ ఆర్ధిక సంఘం అభ్యంతరాలు చెపుతోంది, విజయవాడలో 20లక్షల మంది జనాభా లేరు కనుక అక్కడ మెట్రో రైలు ప్రాజెక్టు లాభసాటికాదు. కనుక దానికి నిధులు మంజూరు చేయలేమని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటుకి రాజ్యాంగ సవరణ అనే కొర్రీ పడినట్లుంది.